సైరా... నాకు సవాల్‌లాంటిది : చిరంజీవి | SYE RAA NARASIMHA REDDY First Look Motion Poster | Sakshi
Sakshi News home page

సైరా... నాకు సవాల్‌లాంటిది : చిరంజీవి

Published Wed, Aug 23 2017 12:16 AM | Last Updated on Tue, Sep 12 2017 12:46 AM

SYE RAA NARASIMHA REDDY First Look Motion Poster



‘ఎప్పటి నుంచో స్వాతంత్య్ర సమరయోధుల పాత్రలో... ముఖ్యంగా భగత్‌సింగ్‌ పాత్రలో నటించాలనుకుంటున్నా. ఇన్నాళ్లకు తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఈ పాత్ర నాకు సవాల్‌లాంటిది’’ అని చిరంజీవి అన్నారు. ఆయన పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్‌లో మంగళవారం ఫ్యాన్స్‌ సమక్షంలో జరిపారు. ఈ సందర్భంగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తండ్రి చిరంజీవి హీరోగా తనయుడు రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ మోషన్‌ పోస్టర్‌ను దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను నిర్మాత అల్లు అరవింద్‌ విడుదల చేశారు. ఈ వేడుకకు చిరంజీవి రాకపోయినా, తన మనసులోని మాటలను వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

చిరంజీవి మాట్లాడుతూ – ‘‘సైరా నరసింహారెడ్డి’ కోసం సురేందర్‌రెడ్డి చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కనున్న ఈ చిత్రం అద్భుత దృశ్యకావ్యంలా ఉంటుంది. నాపై ఇంత ప్రేమ చూపిస్తున్న మీలాంటి అభిమానుల కోసం నేనేం చేయగలను? మీరు గర్వపడే సినిమాలు చేయడం తప్ప. ‘సైరా నరసింహారెడ్డి’ మీరందరూ గర్వపడే సినిమా అవుతుంది’’ అన్నారు. అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారి 40ఏళ్ల సినీ ప్రయాణంలో 37ఏళ్లు ఆయనతో కలసి నేనూ ప్రయాణించడం సంతృప్తిగా ఉంది. ఆయన వేసిన తారు రోడ్డులో పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, వరుణ్‌ తేజ్, సాయిధరమ్‌ తేజ్, శిరీష్, నీహారిక సాఫీగా ప్రయాణం సాగిస్తున్నారు.


 ఇందుకు వారు చిరంజీవికి కృతజ్ఞతగా ఉంటారు’’ అన్నారు. ‘‘బాహుబలి’ అంత పెద్ద విజయం సాధించడానికి కారణం సాంకేతిక నిపుణులే. ‘సైరా నరసింహారెడ్డి’కి కూడా మంచి టెక్నీషియన్స్‌ కుదిరారు. ఇది చిరంజీవిగారి 151వ చిత్రం అంటున్నారు. కానీ, 150 సినిమాల మైలురాయి దాటిన తర్వాత ఆయన నటిస్తున్న తొలి చిత్రం అనిపిస్తోంది’’ అన్నారు రాజమౌళి. రామ్‌చరణ్‌ మాట్లాడుతూ– ‘‘మీరు మా అభిమానులా? లేక మేము మీ అభిమానులా? అని నాకు డౌట్‌గా ఉంది. నాన్నగారి పుట్టినరోజును పురస్కరించుకుని 42,000 మంది రక్తదానం చేయడం గ్రేట్‌. అందుకే నాన్నగారు అభిమానులను ‘మెగా ఫ్యాన్స్‌ కాదు.. మెగా బ్లడ్‌ బ్రదర్స్‌’ అంటుంటారు. సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, మీ అభిమానం మాత్రం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఈ సినిమాలో పనిచేయనున్న ఆర్టిస్టులందరూ అడగ్గానే ఒప్పుకోవడం ఆంజనేయస్వామి ఆశీస్సుల వల్లే అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘ఎందుకో తెలియదు కానీ, ‘సైరా నరసింహారెడ్డి’ పేరు చెబితే నాకు ఒక విధమైన వణుకు మొదలవుతోంది.

 ఇప్పుడు నా ఫోకస్‌ మొత్తం ఈ సినిమాపైనే. నాపై పెద్ద బాధ్యత పెట్టారు. నాకు  చిరంజీవిగారు, రామ్‌చరణ్‌ సపోర్ట్‌గా ఉన్నారు. మెగా ఫ్యాన్స్, ప్రేక్షకుల సపోర్ట్‌ కూడా కావాలి’’ అని సురేందర్‌ రెడ్డి అన్నారు. రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ, దర్శకుడు సుకుమార్, హీరోలు సాయిధరమ్‌తేజ్, వరుణ్‌తేజ్, నిర్మాత పి. కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్, జగపతిబాబు, నయనతార, సుదీప్, విజయ్‌ సేతుపతి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: ఎ.ఆర్‌. రెహమాన్, కెమెరా: రవివర్మన్, కథ: పరుచూరి బ్రదర్స్, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, సమర్పణ: సురేఖ కొణిదెల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement