అందుకే గ్లామర్ డోస్ పెంచాను: నటి
సాక్షి, చెన్నై : సినిమాల్లో గ్లామర్ ఒక భాగం. గ్లామర్‌కు కేరాఫ్ హీరోయిన్లే. ఏదైనా హద్దుల్లో ఉంటేనే ముద్దు. ఒకప్పుడు శృగారభరిత గీతాలకంటూ ప్రత్యేకంగా తారలుండేవారు. ఇప్పటికీ అలాంటి డాన్సర్లున్నా, ఈ తరం హీరోయిన్లు అందాల ఆరబోతలో వారికి ఏ మాత్రం తీసిపోవడం లేదు. చాలా మంది హీరోయిన్లు గ్లామర్‌తోనే చలామణి అయిపోతున్నారు. అయితే అందుకు వారు చెప్పే సాకు అభిమానులు కోరుకుంటున్నారన్నది. నటి రాయ్‌లక్ష్మీ తన తొలి హింది చిత్రం జూలీ 2 చిత్రంలో విచ్చలవిడిగా అందాలను ఆరబోసి వార్తల్లోకెక్కారు. తాజాగా నటి తాప్సీ అదే బాట పట్టారు. దక్షిణాదిలో ఒక రౌండ్ కొట్టిన ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్‌నే నమ్ముకున్నారు.
తాజా హిందీ చిత్రం జుడ్వా 2 విడుదలకు సిద్ధంగా ఉంది. వరుణ్‌దావన్ హీరోగా నటించిన ఇందులో మరో హీరోయిన్‌గా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించారు. ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలైంది. ఇందులో తాప్సీ ఈత దుస్తులు, టూపీస్ అంటూ అందాలను శృతిమించి ఆరబోశారు. ఏమిటీ ఇంతగా అంటే.. గ్లామరస్‌గా నటించడం తనకు కొత్తేమీ కాదంది. ఇంతకు ముందు దక్షిణాది చిత్రాల్లో గ్లామర్‌గా నటించానన్నారు. బాలీవుడ్ ప్రేక్షకులు గత మూడేళ్లుగా తన చిత్రాలను ఆదరిస్తున్నారని, అలాంటి వారిని సంతృప్తి పరచడం నటిగా తన బాధ్యత అని చెప్పారు.
అబిమానుల కోరిక మేరకు జూడ్వా 2 చిత్రంలో కాస్త మోతాదు మించే గ్లామర్‌గా నటించానని చెప్పుకొచ్చారు. సినిమాకు గ్లామర్, కామెడీ రెండూ ప్రధాన అంశాలయితే ఆ రెండూ జుడ్వా 2 చిత్రంలో ఉంటాయన్నారు తాప్సీ. ఇంతకు ముందు జూడ్వా చిత్రంలో నటి రంభ పోషించిన పాత్రను దానికి సీక్వెల్ అయిన జూడ్వా 2లో తాప్సీ నటించిందన్నది గమనార్హం. ఈ నెలాఖర్లో జుడ్వా 2 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.