
ఆత్మరక్షణకు శిక్షణ
ఆత్మరక్షణ విద్యలో శిక్షణ పొందుతున్నానంటోంది నటి తాప్సీ. ఈ బ్యూటీ ఇటీవల ఎక్కువగా సెల్ఫ్ ప్రచారం చేసుకోవడానికి తెగ తంటాలు పడుతోందనిపిస్తోంది. ఆ మధ్య తాను ఢిల్లీ భామను, తనకు ధైర్యం ఎక్కువ అని డబ్బా కొట్టుకుంది. హిందీ చిత్రం పింక్‌లో అత్యాచారానికి గురైన యువతి పాత్రల్లో నటించిన తాప్సీ ఇటీవల తాను నిజ జీవితంలో పోకిరిల దురాఘతాలకు గురయ్యానని చెప్పుకుని వార్తల్లో నిలిచింది. తాజాగా ఆత్మరక్షణ విద్యలు నేర్చుకుంటున్నానంటూ మరోసారి వార్తల్లోకెక్కింది.
అయితే ఈ సారి తాను నటించనున్న చిత్రంలోని పాత్ర పోషణ కోసం ఆత్మరక్షణ విద్యలు నేర్చుకుంటున్నట్లు తాప్సీ పేర్కొంది. కోలీవుడ్‌లో ఆడుగళం, కాంచన-2 వంటి రెండు మూడు విజయాలతోనే సరిపెట్టుకున్న ఈ ముద్దుగమ్మకు ఇక్కడ అవకాశాలు కరువయ్యాయి. అయితే లక్కీగా హిందీలో జాక్‌పాట్ లాంటి అవకాశాన్ని కొట్టేసింది. అక్కడ బిగ్‌బీ అమితాబ్‌తో పింక్ చిత్రంలో నటించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో బాలీవుడ్‌లో చిన్నగా అవకాశాలు రావడం మొదలెట్టాయి.
తాజాగా నామ్ షబానా అనే చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ చిత్రం కోసమే ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ పొందుతోందట. దీని గురించి తను తెలుపుతూ పింక్ చిత్రం తనకు మంచి పేరు తెచ్చిపెట్టిందని అంది. ప్రస్తుతం నామ్ షబానా చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపింది. ఇది తాను ఇంతకు ముందు నటించిన బేబి చిత్రానికి సీక్వెల్ అని చెప్పింది. ఇందులోని పాత్ర కోసం క్రావ్ మగా అనబడే ఇజ్రాయిల్ దేశంలో ప్రాచుర్యం పొందిన ఆత్మరక్షణ విద్యతో పాటు అయికిడో అనే జపాన్ ఆత్మరక్షణ విద్య తదితర మూడు రకాల విద్యలను నేర్చుకుంటున్నట్లు చెప్పింది.
ఇందుకోసం నిత్యం గంటన్నర సమయాన్ని కేటాయిస్తున్నట్లు తెలిపింది. కథా పాత్రకు అవసరం అవ్వడంతో ఈ విద్యల్లో శిక్షణ పొందుతున్నట్లు వివరించింది. ఇందులో నటుడు అక్షయ్‌కుమార్ అతిథి పాత్రలో నటించనున్నారని, ఆయనకు తనకు మధ్య యాక్షన్ సన్నివేశాలు చోటు చేసుకంటాయా అన్నది తెలియదని అంది. మనోజ్ బాజ్‌పాయ్, మలయాళ నటుడు పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారని తాప్సీ తెలిపింది.