
పద్మభూషణ్‌కి విజయనిర్మలగారి పేరును ప్రతిపాదిస్తాం
విజయనిర్మలగారు గొప్ప నటి. మంచి దర్శకురాలు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన లేడీ డైరెక్టర్ ఆమె.
– తలసాని శ్రీనివాస యాదవ్
‘‘విజయనిర్మలగారు గొప్ప నటి. మంచి దర్శకురాలు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన లేడీ డైరెక్టర్ ఆమె. విజయనిర్మలగారి పేరును పద్మభూషణ్ పురస్కారానికి ప్రభుత్వం తరపున సిఫార్సు చేయనున్నాం’’ అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, దర్శకురాలు, నటి విజయ నిర్మలకు రాయల్ అకాడమీ డాక్టరేట్‌ను ప్రదానం చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో శుక్రవారం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో తలసాని శ్రీనివాస యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కృష్ణ, విజయనిర్మలను శాలువాతో సత్కరించారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, ప్రధాన కార్యదర్శి నరేశ్, ఇతర సభ్యులు శ్రీకాంత్, వేణు మాధవ్, హేమ తదితరులు పాల్గొన్నారు.