బాలీవుడ్ లాభం లేదు
ఆశించింది జరగకపోతే ఇక లాభం లేదు ప్రత్యామ్నాయం చూసుకోవలసిందే అని అనుకోవడం సహజం. ప్రస్తుతం నటి తమన్నా ఇలాంటి చింతలోనే ఉన్నారని సమాచారం. ఈ ముంబయి బ్యూటీకి బాలీవుడ్ అచ్చిరాలేదు. ఆదిలో ఒకసారి చాన్సా రోషన్ చేట్రా చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అది ఆశాజనకంగా లేకపోవడంతో దక్షిణాదిపై దృష్టి సారించింది.
టాలీవుడ్‌లో శ్రీ చిత్రంలో, కోలీవుడ్‌లో కేడీ చిత్రంతో రంగప్రవేశం చేసినా ఆ రెండు చిత్రాలూ ఆశించిన విజయాన్ని అందించకపోయాయి. అయితే టాలీవుడ్ చిత్రం హ్యాపీడేస్ తమన్నా జీవితంలో వెలుగు నింపింది. ఆ తర్వాత ఈ ఉత్తరాది బ్యూటీ దక్షిణాది (తెలుగు, తమిళం)లో దూసుకుపోతోంది. ఇక్కడే నంబర్‌వన్ హీరోయిన్లకు దీటుగా ఎదిగిన తమన్నా బాలీవుడ్ మోహం తిరిగి చూడలేదు.
గత ఏడాది హిమ్మత్‌వాలా చిత్రంతో మరోసారి బాలీవుడ్‌లో ప్రవేశించి విజయమే లక్ష్యంగా అందాలను ఆరబోసింది. అలా ఎంత శ్రమించినా చిత్రం విజయం సాధిస్తేనే కథ నేమ్ అయినా ఫేమ్ అయినా వచ్చేది. ఆ తర్వాత మరోసారి హమ్‌షకల్స్ చిత్రంలో నటించే అవకాశాన్ని బాలీవుడ్ కల్పించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోర్లా పడడంతో బాలీవుడ్‌లో వెలగాలన్న తమన్నా ఆశ నీరుగారిపోయింది. దీంతో పిచేముడ్ అంటూ మళ్లీ తమిళం, తెలుగు భాషలపై దృష్టి సారించింది. తెలుగులో ప్రోత్సాహకంగానే ఉన్నా తమిళంలోనే అవకాశాలు రావడం లేదు.
టాలీవుడ్‌లో అనుష్క హీరోయిన్‌గా నటిస్తున్న బాహుబలి చిత్రంలో ముఖ్య భూమిక పోషిస్తున్న తమన్నా మహేష్‌బాబు సరసన ఆగడు చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. మధ్యలో గ్యాప్ రావడంతో స్పెషల్ సాంగ్స్‌లో కూడా తన లెగ్స్‌ను షేక్ చేసింది. అలా తెలుగులో సమంత హీరోయిన్‌గా నటించిన అల్లుడు శ్రీను, తమిళంలో నయనతార నాయకిగా నటించిన నన్బేండ చిత్రాలు త్వరలో తెరపైకి రానున్నాయి. ప్రస్తుతం నటిస్తున్న ఈ చిత్రాలు సాధించే సక్సెస్‌లపైనే తమన్నా నట భవిష్యత్ ఆధారపడి ఉదంటుదని చెవులు కొరుక్కుంటున్నాయి సినీవర్గాలు.
విదేశీ విహారం
ఈ ముద్దుగుమ్మ నటనకు గ్యాప్ రావడంతో ఈ సమయాన్ని విదేశీ విహారానికి సద్వినియోగం చేసుకుంటోంది. ఈ నెలలో యూఎస్‌కు పయనమవుతున్నారు. తమన్నాకు ఫిలడెల్‌ఫియాలో జర గనున్న ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమం ముగించుకుని తమన్నా తన తల్లితోసహా న్యూయార్క్‌ను చుట్టిరానున్నారు. ఈ విహారయాత్రలో ఈ బ్యూటీ ఎలాంటి సెలబ్రిటీ హంగులు లేకుండా ముఖానికి మేకప్ కూడా లేకుండా ఒక సాధారణ అమ్మాయిగా ఎంజాయ్ చేయనున్నారట. అనంతరం స్వదేవానికి తిరిగొచ్చి తెలుగు చిత్ర షూటింగ్‌ల్లో పాల్గొననున్నారని సమాచారం.