
ప్చ్... సంతోషమే కానీ!
అభిమాన దర్శకుడితో పనిచేసే ఛాన్స్ వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. తమన్నా మాత్రం ఓ పక్క సంతోషపడుతూ... మరోపక్క కొంచెం బాధ పడుతున్నారు. ఎందుకంటే... ఆమెకు అభిమాన దర్శకుడితో పనిచేసే ఛాన్స్ మాత్రమే వచ్చింది. ఆయన దర్శకత్వంలో నటించే ఛాన్స్ ఇంకా రాలేదు. అసలు విషయం ఏంటంటే... ‘పెళ్లి చూపులు’ తమిళ రీమేక్‌లో తమన్నా నటించనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ రీమేక్‌కి నిర్మాత. ఆయనతో కలసి పనిచేయాలనేది తమన్నా కల అట! అది తమిళ ‘పెళ్లి చూపులు’ రీమేక్‌తో తీరనుంది.
ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ –‘‘నేను గౌతమ్ మీనన్‌కి పెద్ద అభిమానిని. ముఖ్యంగా ఆయన సినిమాల్లో మహిళలను చూపించే విధానం నాకు చాలా ఇష్టం. రొమాన్స్‌ని ఆయన అర్థం చేసుకున్నట్టు... ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. ఎప్పట్నుంచో ఆయనతో కలసి పని చేయాలనుకుంటున్నాను. ‘పెళ్లి చూపులు’ రీమేక్‌తో ఆయన నిర్మాణంలో నటించే ఛాన్స్ వచ్చింది. సో, ఐయామ్ హ్యాపీ. త్వరలో ఆయన దర్శకత్వంలో నటించే ఛాన్స్ వస్తుందని ఆశిస్తున్నా. అప్పటివరకూ కొంచెం బాధ ఉంటుంది’’ అన్నారు. గౌతమ్ మీనన్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన సెంథిల్ వీరస్వామి ‘పెళ్లి చూపులు’ రీమేక్‌కి దర్శకుడు. ఈ సినిమాతో పాటు హిందీ హిట్ ‘క్వీన్’ తమిళ రీమేక్‌లో కూడా తమన్నా నాయికగా నటించనున్న సంగతి తెలిసిందే.