లక్కు తెచ్చే పాట...లక్షలిచ్చే పాట... | Tamanna special song again with Bellamkonda Srinivas | Sakshi
Sakshi News home page

లక్కు తెచ్చే పాట...లక్షలిచ్చే పాట...

Published Sat, Oct 31 2015 10:57 PM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

లక్కు తెచ్చే పాట...లక్షలిచ్చే పాట... - Sakshi

లక్కు తెచ్చే పాట...లక్షలిచ్చే పాట...

మిల్కీబ్యూటీ తమన్నా ఇప్పుడు సినిమాలతోనే కాదు... స్పెషల్ సాంగ్ ఆఫర్లతోనూ బిజీగా ఉన్నారు.
గత ఏడాది ‘అల్లుడు శీను’ సినిమాలో ఈ అందాల తార ఒక ప్రత్యేక నృత్య గీతంలో నటించిన సంగతి తెలిసిందే. నిర్మాత బెల్లంకొండ సురేశ్ కుమారుడైన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయమైన ఆ చిత్రంలో ‘నా ఇంటి పేరు సిల్కు...’ అనే పాట బాగానే ఫేమస్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఈ యువ కథానాయకుడు నటిస్తున్న రెండో సినిమాలో కూడా తమన్నా ఒక స్పెషల్ సాంగ్ చేస్తోంది. మొన్న మొన్నటి వరకు కృష్ణానగర్ ఖబర్‌గానే ఉన్న ఈ వార్తను తమన్నా ఇప్పుడు ధ్రువీకరించారు. మంచి బీట్‌తో ఉండే ఒక స్పెషల్ సాంగ్‌లో శ్రీనివాస్ పక్కన నర్తిస్తున్నట్లు ఆమె చెప్పారు. ‘‘గతంలో శ్రీనివాస్‌తో చేసిన పాట లాగానే ఈ పాట కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఇదీ హిట్టవుతుందని భావిస్తున్నా’’ అన్నారామె. ఈ పాట కోసం ప్రత్యేకంగా ఒక సెట్ వేస్తున్నారట.

 తమిళ సూపర్‌హిట్ ‘సుందర్ పాండియన్’ ఆధారంగా దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు రూపొందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాకు ఈ సాంగ్ ఓ స్పెషల్ ఎట్రాక్షన్ అన్నమాట. నిజానికి, ఇటీవలే ‘బాహుబలి’లో మెప్పించిన తమన్నా త్వరలోనే రానున్న ‘బెంగాల్ టైగర్’లో మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. డిసెంబర్ నుంచి మొదలయ్యే ‘బాహుబలి-2’ షూటింగ్ కోసం సిద్ధమవుతున్నారు. అప్పట్లో ‘అల్లుడు శ్రీను’ పాటకి కోటి పైగా పారితోషికం తమన్నా తీసుకున్నట్లు జనం చెప్పుకొన్నారు. కాగా, ఇప్పుడీ పాటకు ఆమెకు రూ. 80 లక్షల దాకా ఇవ్వనున్నారని ఫిలిమ్‌నగర్‌లో చెప్పుకుంటున్నారు. ఆ పాట లానే ఈ కొత్త సాంగ్ కూడా సినిమాకు లక్కీగా మారుతుందని దర్శక, నిర్మాతల నమ్మకం. మొత్తానికి, అటు పూర్తిస్థాయి పాత్రలతో బిజీగా ఉంటూనే, ఈ స్పెషల్ సాంగ్‌లకూ సై అనడం ఈ పంజాబీ భామ ధైర్యానికి ఒక ఉదాహరణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement