బొద్దే ముద్దు
సాధారణంగా స్లిమ్‌గా, అందంగా ఉన్న భామల్ని చూసి ఎంత చక్కగున్నావే అంటూ పాడుకుంటుంటారు. అందు కు భిన్నంగా నటి తమన్న బొద్దుగా తయారయ్యే పనిలో పడడం విశేషం. నిజానికి ఈ బ్యూటీ సన్నగా, నాజుగ్గా ఉంటారు. కోలీవుడ్‌లో కేడీ చిత్రం ద్వారా ప్రతి నాయకిగా పరిచయమయ్యారు తమన్న. ఈ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో టాలీవుడ్‌లో హ్యాపీడేస్‌తో తొలి విజయాన్ని అందుకున్నారు. దీంతో మళ్లీ తమిళంలో అవకాశాలు వరించాయి. పైయ్యా, అయన్ వంటి చిత్రాలతో సక్సెస్‌ఫుల్ నటిగా వెలిగిన తమన్నకు వేంగై తర్వాత అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్‌పై దృష్టి సారించారు. అనంతరం బాలీవుడ్‌లో పరిచయమైన తమన్నకు ప్రస్తుతం ఈ మూడు భాషలలోనూ అవకాశాలు అంతంత మాత్రమే.
తమిళంలో చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం వీరం జనవరి 10న విడుదలకు ముస్తాబవుతోంది. తదుపరి అవకాశాలేమీ లేవు. దీంతో ఆఫర్ల అన్వేషణలో పడ్డారు. సన్నగా నాజుగ్గా ఉన్న ఈ బ్యూటీని కొంచెం మార్పు కోసం కాస్త లావెక్కమని కొందరు దర్శక నిర్మాతలు సలహా ఇచ్చారట. బరువెక్కడం ఎంతపని మళ్లీ సన్నబడడమే కష్టం అనుకున్న తమన్న లావెక్కే విషయం గురించి మరి కొందరు సన్నిహిత దర్శకుల సలహాలు అడిగారట. అందుకు వారు కోలీవుడ్‌లో అవకాశాలు రాబట్టాలంటే బరువెక్కడంలో తప్పు లేదని, కోలీవుడ్ ప్రేక్షకులకు బొద్దుగుమ్మలనే అధికంగా ఇష్టపడే వారని హితవు పలికారట. దీంతో ఈ మిల్కీ బ్యూటీ కాస్త ఒళ్లుపెంచే పనిలో పడ్డారట.