
ఇక తమన్నా భయపెడుతుంది
హార్రర్ కామెడీలకు ఇప్పుడు మంచి గిరాకీ నడుస్తోంది. తెలుగు, తమిళం, హిందీ - ఇలా ఏ భాషలోకి వెళ్ళినా బాక్సాఫీస్ వద్ద ఇవి మినిమమ్ గ్యారంటీ అయిపోయాయి. నయనతార (‘మాయ’), త్రిష (‘కళావతి’, రానున్న ‘నాయకి’), హన్సిక (‘చంద్రకళ’), రాయ్ లక్ష్మి (తెలుగులో ‘శివగంగ’గా వస్తున్న తమిళ ‘షావుకార్ పేట్టై’) లాంటి పలువురు పేరున్న తారలు ఆ స్క్రిప్టులు ఎంచుకుంటున్నది అందుకే! తాజాగా, మన మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఆ లిస్టులో చేరిపోయిందని కోడంబాకమ్ వర్గాల భోగట్టా. నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడైన ప్రభుదేవాతో కలసి తమ్మూ బేబీ ఒక హార్రర్ సినిమాలో నటిస్తోందట! రెండు రోజుల క్రితమే ఈ చిత్రా నికి సంబంధించిన ప్రత్యేక ఫోటోషూట్‌ను ముంబయ్‌లో తీసినట్లు సమాచారం.
నటి అమలాపాల్‌ను పెళ్ళి చేసుకున్న యువ దర్శకుడు ఎ.ఎల్. విజయ్ ఈ చిత్రానికి డెరైక్టర్. ఇటీవలే ‘ప్రభుదేవా స్టూడియోస్’ పేరిట చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించిన ప్రభుదేవా ఈ సినిమాను సొంతంగా నిర్మిస్తారట. విశేషం ఏమిటంటే, ప్రస్తుతమున్న బాక్సాఫీస్ సూత్రాలకు తగ్గట్లే తమిళ, తెలుగు, హిందీ భాషలు మూడింటిలో ఈ హార్రర్ కామెడీని తెరకెక్కించడం! సినిమాలో ఒకరికొరకు జంటగా నటిస్తారో, లేదో కానీ ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం ప్రభుదేవా, తమన్నా కీలక పాత్రధారులు. అలాగే, ‘అరుంధతి’లో ‘వదల బొమ్మాళీ వదల...’ అని మెప్పించిన సోనూ సూద్ అత్యంత కీలక పాత్ర ధరిస్తారు.
విభిన్నమైన కథాంశంతో తయారవుతున్న సినిమా ఇదని సన్నిహిత వర్గాల మాట.‘బాహుబలి-2’, తమిళ ‘ధర్మదురై’ లాంటి సినిమాలతో బిజీగా ఉన్న తమన్నా అవి అయిపోగానే ఈ సినిమా పనిలో పడతారట! మొత్తానికి, నటుడు - కొరియోగ్రాఫర్ - దర్శకుడు లారెన్స్ ఇప్పటికే ‘ముని’, ‘కాంచన’ లాంటి సినిమాలతో భయపెడితే, ఇప్పుడు ప్రభుదేవా అదే బాటలో వెళుతున్నట్లు కనిపిస్తోంది