నేను నటిస్తా బ్రదర్
సుమారు పుష్కర కాలం తరువాత ప్రభుదేవా తమిళంలో నటిస్తున్న చిత్రం దేవి. ఆయనకు జంటగా మిల్కీబ్యూటీ తమన్నా నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ దర్శకుడు. సైవం, ఇదు ఎన్న మాయం చిత్రాల తరువాత చిన్న గ్యాప్ తీసుకుని ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న దేవి చిత్రం విడుదల తేదీని యూనిట్ వర్గాలు ఖరారు చేశారు. సెప్టెంబర్ తొమ్మిదో తేదీన చిత్రం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్‌తో చిన్న భేటీ.
ప్ర: దేవి చిత్రం గురించి చెప్పండి?
జ: దేవి విభిన్న హారర్ కథా చిత్రం. ముంబయిలో నివశించే తమిళ యువకుడు ప్రభుదేవా మంచి మోడ్రన్‌గా ఉండే అమ్మాయి తన జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటారు. అలాంటిది పక్కా గ్రామీణ యువతి భార్య అవుతుంది. ఈ నేపథ్యంలో జరిగే సంఘటనలే దేవి చిత్రం.
ప్ర: వారానికి రెండు హారర్ చిత్రాలు వస్తున్న సందర్భంలో మీరూ ఆ ట్రెండ్‌కు మారారా?
జ: నిజం చెప్పాలంటే దెయ్యాల కథల సీజన్, హారర్ చిత్రాల ట్రెండ్‌కు ముందే తయారు చేసుకున్న కథ ఇది. సరైన టీమ్ సెట్ కాకపోవడంతో చిత్ర నిర్మాణం వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ప్రభుదేవా వచ్చి చేరారు. నాలుగేళ్లుగా తయారు చేసుకున్న కథ నలభై రోజుల్లో చిత్రీకరణతో పూర్తి అయింది. ఇంతకు ముందెప్పుడూ చూడని హారర్ కథా చిత్రంగా దేవి ఉంటుంది.
ప్ర: ప్రభుదేవా పెద్ద దర్శకుడు. ఆయన్ని ఎలా ఇందులో నటించడానికి ఒప్పించారు?
జ: మొదటిలో నాకు అలాంటి భయం కలిగింది. చిత్రంలో తమన్నా పాత్రకే ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి కథలో ప్రభుదేవా నటిస్తారా అన్న సంశయం కలిగింది. ధెర్యం చేసి ప్రభుదేవాకు కథ చెప్పాను. బ్రహ్మాండంగా ఉంది బ్రదర్. నేను నటిస్తానంటూ ఆయన నుంచి బదులు వచ్చింది. ఇందులో ఒక పాటకు మీరే నృత్య దర్శకత్వం వహించాలని కోరగా 12 ఏళ్ల తరువాత తమిళంలోకి వస్తున్నాను.చిత్రం బాగా రాావడానికి ఏం చేయమన్నా చేస్తాను అని అన్నారు.
ప్ర: ఆ చిత్రం కోసం తమన్నాను పూర్తిగా మార్చేశారటగా.
జ: టైటిల్ రోల్ ఆమెదే. పక్కా గ్రామీణ యువతిగా మారిపోయారు. ఆమె మేకప్‌కే గంటన్నర పట్టేది.
ప్ర: హాలీవుడ్ కథా రచయిత పాల్ ఆరోన్ ఈ కథలోకి ఎలా వచ్చారు?
జ: నిజానికి ఈ చిత్రానికి ముందు ఆయన ఎవరో నాకు తెలియదు. సైవం చిత్రానికి సౌండ్ మిక్సింగ్ కోసం లాస్‌ఎంజిల్స్ వెళ్లినప్పుడు ఆయన తన ఇన్ టూ టిప్ చిత్ర పని కోసం అక్కడికి వచ్చారు. అప్పుడు పరిచయమయ్యారు. సినిమాకు సంబంధించిన విషయాలు చాలా చర్చించుకునేవాళ్లం.అలా దేవి చిత్ర కథలో ఆయన భాగస్వామ్యం చాలా ఉంది.