
ఇంద్రజను తలపిస్తున్న అవంతిక
‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ చిత్రాన్ని పునర్నిర్మించాలనుకుంటే... అందులో శ్రీదేవి పోషించిన ఇంద్రజ పాత్ర కోసం ప్రత్యేకించి గాలించాల్సిన పని లేదు. తమన్నా... ఆ పాత్రకు పర్‌ఫెక్ట్. ఆదివారం మీడియాకు విడుదల చేసిన ‘బాహుబలి’లో తమన్నా ఫస్ట్ లుక్‌ని చూస్తే అది నిజమని ఎవరైనా ఒప్పుకుంటారు. పోగొట్టుకున్న అంగుళీయకం కోసం దివి నుంచి భువికేతెంచిన ఇంద్రజలా... తళతళ మెరిసిపోతున్నారీ ఫస్ట్ లుక్‌లో తమన్నా. దర్శకుడు రాజమౌళిపై తన గురువు కె.రాఘవేంద్రరావు ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఈ ఫస్ట్ లుక్ చూస్తే అర్థమైపోతుంది.
ఇందులో ప్రభాస్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. తండ్రికి జోడీగా అనుష్క నటిస్తుండగా, కొడుకు పాత్రతో తమన్నా జతకడుతున్నారు. ఇందులో తమన్నా పాత్ర పేరు అవంతిక. రానా ప్రతినాయకునిగా నటిస్తున్న విషయం తెలిసిందే. రమ్యకృష్ణ, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడు. 2015లో ‘బాహుబలి’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.