
తమిళ సినిమా : అర్జున్‌రెడ్డి అనూహ్య విజయాన్ని సాధించిన ఈ చిత్రం ఇంతకు ముందు టాలీవుడ్‌లో మారుమోగింది. ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. తెలుగులో యువ నటుడు విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఇప్పుడు కోలీవుడ్‌లో తెరకెక్కడానికి సిద్ధం అవుతోంది. ఇదేమంత విశేషం కాదు. అయితే, ఇందులో విజయ్ దేవరకొండ పాత్రను నటుడు విక్రమ్ వారసుడు ధృవ పోషించనుండటం కచ్చితంగా విశేషమే అవుతుంది. ఎందుకంటే ధృవ పరిచయ చిత్రం ఇదే అవుతుంది.
ఇక అంతకంటే సంచలనం ఏమిటంటే వైవిధ్య కథా చిత్రాల దర్శకుడు బాలా హ్యాండిల్ చేయనుండటం. విక్రమ్‌కు సేతు చిత్రంతో సినీ జీవితానిచ్చిన ఈయన తన కొడుకు నట జీవితానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతం అధర్వ, జ్యోతికలతో నాచ్చియార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న బాలా ధృవ హీరోగా రూపొందించనున్న చిత్ర షూటింగ్‌ను డిసెంబర్‌లో ప్రారంభించనున్నారు.
కాగా ఈ చిత్రానికి వర్మ అనే పేరును ఖరారు చేశారు. టైటిల్ ఫస్ట్‌లుక్‌ను నటుడు విక్రమ్ శుక్రవారం విడుదల చేశారు. వర్మ చిత్ర ఫస్ట్‌లుక్‌కు సినీ వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ టైటిల్‌పై దర్శకుడు వర్మ వ్యంగ్యాస్త్రాలను సంధించారు. చాలా విషయాలపై ట్విట్టర్ ద్వారా స్పందించే దర్శకుడు వర్మ ఈ ధృవ చిత్ర టైటిల్‌పై కూడా తనదైన బాణీలో పరిహాసం చేశారు.
ఆయనేమన్నారంటే..వర్మ ఆ పేరు ఎక్కడో విన్నట్టు గుర్తున్నట్టు అనిపిస్తున్నట్టు ఉంది అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వర్మ టైటిల్‌పై దర్శకుడు వర్మ చేసి వ్యాఖ్యలిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment