అర్థం చేసుకునే అర్ధాంగి
అర్థం చేసుకునే అర్ధాంగి
Published Thu, Jan 23 2014 12:42 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM
అభిమతాలు, మన స్తత్వాలు వేరైనా అర్థం చేసుకునే అర్ధాంగి దొరికిందంటున్నారు యువ సంగీత తరంగం జి.వి.ప్రకాష్‌కుమార్. వెయిల్ చిత్రంతో దూసుకొచ్చిన ఈ యువ సంగీత దర్శకుడు అనతి కాలంలోనే అత్యధిక చిత్రాలు చేసి విజయాల బాటలో పయనిస్తున్నారు. ఈ యువ కెరటానికి గత ఏడాది చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈయన నిర్మాత అయ్యింది, హీరోగా తెరంగేట్రం చేసింది, ప్రేయసి సైంధవిని జీవిత భాగస్వామిగా చేసుకున్నది 2013లోనే. ఈ యువ సంగీత బాణి జి.వి.ప్రకాష్‌కుమార్‌తో ఇంటర్వ్యూ.
సంగీత దర్శకుడి నుంచి నిర్మాతగా, నటుడిగా మారడానికి కారణం?
దర్శకుడు విక్రమ్ సుకుమార్ నాకు మంచి మిత్రుడు. ఆయన చెప్పిన కథ, బడ్జెట్ నాకు నచ్చాయి. అందువల్లనే నిర్మాతగా మారి మదయానైకూటం చిత్రాన్ని చేశాను. ఊహించినట్లుగానే ఆ చిత్రం మంచి విజయాన్ని అందించింది. నటుడవడానికి కారణం దర్శకుడు మురుగదాస్. ఆయనే ముందుగా నన్ను నటించమని అడిగారు. ఎందుకనో ఆయన చిత్రంలో నటించలేకపోయూను. ఇది నన్ను నిరాశ పరచింది. అయితే ఈ విషయం బయటకి పొక్కడంతో పలువురు దర్శకులు నన్ను సంప్రదించడం ప్రారంభించారు. అలాంటి వారిలో దర్శకుడు మణి నాగరాజ్ ఒకరు. ఆయన పెన్సిల్ స్క్రిప్టుతో వచ్చారు. స్క్రిప్ట్ చదివాను నచ్చింది. అయినా కొంచెం సంశయం లేకపోలేదు. దాన్ని దర్శకుడు మణి నాగరాజ్ తొలగించి ప్రోత్సహించారు. అలా కథా నాయకుడిగా తెరంగేట్రం చేశాను.
నటన కొనసాగిస్తారా?
నటన విషయంలో నా భార్య చాలా షరతు లు విధించారు. అందువలన నటుడిగా పరిమి త చిత్రాలనే చేయాలని నిర్ణయించుకున్నాను. సంగీత దర్శకుడిగా, నిర్మాతగా నా పయనం కొనసాగుతుంది. మంచి కథా బలం ఉన్న నిర్మాతగా, ప్రేక్షకులకు ఆనందాన్ని అందించే చిత్రాలను నిర్మిస్తాను. ప్రతిభావంతులైన దర్శకులకు అవకాశాలు ఇస్తాను.
మీకు సమయం సరిపోతోందా?
నా వెనుక శక్తివంతమైన టీమ్ ఉంది. సంగీతం చిత్ర నిర్మాణానికి కార్యదక్షత గల నా మిత్ర బృందం నాతో వుంది. కాబట్టి చిత్ర నిర్మాణ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలనుకుంటున్నాను.
ఇష్టమైన సంగీత దర్శకుడు?
చాలా పాటలు వింటుంటాను. ముఖ్యంగా సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ సంగీతం నచ్చుతుంది.
మీ భార్యతో కలసి పాడిన పాటలున్నాయూ?
నేను సంగీతాన్ని అందించిన తొలి 12 చిత్రాల్లో నా భార్య, నేను కలసి పాడలేదు. ఆ తరువాత దర్శకుడు విజయ్ అడగడంతో మదరాసు పట్టణం చిత్రంలో మేము తొలిసారిగా కలసి పాడాం. ఆపై మేము పాడిన పాటలన్నీ హిట్టే. ఇందుకు స్పెషల్ కేర్ అంటూ ఏమీ లేదు. మా పాటలు అంతగా సక్సెస్ అవడానికి మా పని మేము సక్రమంగా చేయడమే కారణం.
మీ ప్రియమైన అర్ధాంగి గురించి?
నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భార్య సైంధవి గురించి చెప్పాలంటే నా జీవితంలో లభించిన అదృష్టం ఆమె. చాలా సహనశీలి. మావి భిన్న మనస్తత్వాలైనా ఒకరి కోసం ఒకరు సర్దుకుపోతుంటాం. అలా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం.
మీకు బాగా నచ్చిన హీరోలు?
కమలహాసన్, విక్రమ్
2014లో మీ నూతన ప్రణాళికలు?
కొత్తగా ప్రణాళికలంటూ ఏమీ లేవు. నేను కథా నాయకుడిగా పరిచయం అయిన పెన్సిల్ సక్సెస్ ఫుల్ చిత్రంగా అమరాలి. ఆ తరువాత చిత్ర నిర్మాణం, నటన అంటూ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ నూతన దర్శకులను పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాను.
Advertisement