తమ్మారెడ్డి భరద్వాజ
‘‘ఆమె’ సినిమాకి మంచి పేరు వచ్చింది.. కానీ, కలెక్షన్లు ఆశించిన రీతిలో రాలేదు. కలెక్షన్లు రాకపోవడంతో అన్యాయం జరిగిందని చెప్పడం లేదు’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. అమలాపాల్ లీడ్ రోల్‌లో రత్నకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం‘ఆడై’. ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో రాంబాబు కల్లూరి, విజయ్ మోరవనేని ‘ఆమె’ పేరుతో ఈ నెల 20న తెలుగులో విడుదల చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘తమిళ నిర్మాతలకు నెల కిందటే ‘ఆమె’ కోసం డబ్బులు చెల్లించాం.
తమిళనాడులోని డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇచ్చారు. అయితే ఫైనాన్షియర్లకు నిర్మాతలు డబ్బు కట్టలేదు. చివరకు అమలాపాల్ తన రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వడంతో పాటు ఎదురు డబ్బులు ఇచ్చి విడుదల చేయించింది. ముందుగా అనుకున్నట్లు 19న విడుదలైతే బాగుండేదేమో? ఒక రోజు ఆలస్యంగా విడుదల కావడం వల్ల క్రేజ్ తగ్గిపోయి మా చిత్రం చచ్చిపోయింది. అన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్ అవుతున్న సినిమా చంపేయబడింది. సరైన విడుదల తేదీ, థియేటర్లు దొరక్క చాలామంది నష్టపోతున్నారు.
నాకు దొరికినా తమిళ నిర్మాతల వల్ల నష్టపోయా. దీనిపై తెలుగు ఫిల్మ్ చాంబర్‌లో కేసు పెట్టా. ఓ మంచి సినిమా తీయడం ఎంత ముఖ్యమో దాన్ని పద్ధతిగా విడుదల చేయడం కూడా అంతే ముఖ్యమనే పాఠాన్ని ‘ఆమె’తో నేర్చుకున్నా. ఇక ఈ సినిమా విషయానికొస్తే... నేటితరం ఆవేశంలో, మద్యం మత్తులో విసిరే సవాళ్లు ఎలాంటి ప్రమాదాలకు దారి తీస్తాయనే విషయాన్ని అసభ్యత లేకుండా తీశాడు దర్శకుడు. అమలాపాల్ బాగా నటించింది. ‘మల్లేశం, ఆమె’ లాంటి సినిమాలను ఆదరిస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment