పదేళ్ల క్రితం తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి బాలీవుడ్ నటి తనుశ్రీ గళం విప్పిన నాటి నుంచి భారత్‌లో మీటూ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. పెద్ద మనుషుల ముసుగులో చలామణీ అవుతున్న వివిధ రంగాలకు చెందిన ‘మగానుభావుల’ నిజ స్వరూపాన్ని ఈ ఉద్యమం బట్టబయలు చేసింది. కాగా పదేళ్ల క్రితం ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా షూటింగ్ సమయంలో నానా పటేకర్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ తనూశ్రీ ఆరోపించింది. అంతేకాకుండా నానాపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ విషయం గురించి తనుశ్రీ చెల్లెలు ఇషితా దత్తా మాట్లాడుతూ.. తన అక్కను చూసి గర్వంగా ఫీలవుతున్నట్లు పేర్కొంది. టీవీ నటిగా బిజీగా ఉన్న ఇషితా.. ఏక్తా కపూర్ నిర్మించిన బేపనా ప్యార్ సీరియల్‌తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా చేదు అనుభవం ఎదురైనప్పటికీ తన అక్క ఇండస్ట్రీకి వెళ్లొద్దంటూ నిరాశ పరచలేదని తనుశ్రీ వ్యక్తిత్వం గురించి చెప్పుకొచ్చింది. ‘ వేధింపుల గురించి ధైర్యంగా గళం విప్పిన మా అక్కకు ధన్యవాదాలు. తన కారణంగా ఎంతో మంది మహిళలు మానసిక వేదన నుంచి విముక్తి పొందారు. నిజానికి ఆరోజు ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆనాడు పోలీసులు సరైన సమయానికి రాకపోయి ఉంటే మా అక్క పరిస్థితి ఎలా ఉండేదో. అప్పుడే తను ఫిర్యాదు చేసింది. కానీ ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ ఇటీవలి కాలంలో ఇండస్ట్రీలో కూడా మార్పు వచ్చింది. మహిళలతో పాటుగా ఎంతో మంది నటులు మా అక్కకు అండగా నిలిచారు. వారందరికి కృతఙ్ఞతలు. ప్రస్తుతం ఇదొక సీరియస్ ఇష్యూగా మారింది. ఈ సమిష్టి ఉద్యమం వల్ల పనిచేసే చోట మహిళలకు వేధింపులు కాస్త తగ్గినా మనం ధన్యులమవుతాం. వేధింపుల గురించి చెబితే మానసిక భారం తప్ప పోయేదేమీ లేదని అందరూ గుర్తించారు. నిజానికి తనకు అలా జరిగినా మా అక్క నన్నెప్పుడూ నిరుత్సాహ పరచలేదు. ఇండస్ట్రీలో అందరూ చెడ్డవాళ్లే ఉండరు కదా అని ధైర్యం చెప్పింది. అయితే తను అన్నట్టుగానే అదృష్టవశాత్తు నాకు మా అక్కలాంటి చేదు అనుభవాలు ఎదురుకాలేదు. కానీ నా స్నేహితుల్లో చాలా మందికి ఇలా జరిగింది. వాటి కారణంగా వారి జీవితాల్లో తీవ్ర అలజడి చెలరేగింది’ అని పేర్కొంది. కాగా 2012లో చాణక్యుడు అనే తెలుగు సినిమా ద్వారా ఇషితా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment