ఎందరిని ప్రేమిస్తాను...?
ఎందరిని ప్రేమిస్తాను...?
Published Tue, Jan 28 2014 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM
‘‘నేనెంత మందినని ప్రేమిస్తాను ఇప్పటికే చాలా మందితో కలుపుతూ రాశారు. మీ రాతలకు అంతం ఉండదా?’’ అంటూ మండిపడుతోంది నటి తాప్సీ. ఆడుగళం చిత్రం ద్వారా కోలీవుడ్ కొచ్చి పడిన ఈ ఢిల్లీ బ్యూటీ ఆ తరువాత వందాన్ వెండ్రాన్, మరందేన్ మన్నిత్తేన్, ఆరంభం వంటి చిత్రాల్లో నటించింది. ఆరంభం షూటింగ్ సమయంలో ఆర్యతో ప్రేమాయణం అంటూ, అంతకు ముందే ఒక తెలుగు నటుడితో కలుపుతూ సాగిన ప్రచారం పెద్ద సంచలనాన్నే రేకెత్తించింది.
తాజాగా మరో కొత్త బాయ్ ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలంటూ ప్రచారం జోరందుకుంది. ఆయనెవరో కాదు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మాథ్యూస్ బోవ్ నే. ఈ ప్రేమ పక్షులిద్దరూ నిత్యం ఫేస్‌బుక్ ద్వారా మాటల రొమాన్స్ చేసుకుంటున్నారట. సమయం దొరికినప్పుడల్లా జంటగా చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారట. ప్రస్తుతం షాదీ డాట్‌కామ్ అనే హిందీ చిత్రంలో తాప్సీ నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల చండీగఢ్‌లో జరిగింది. ఆ సమయంలో తాప్సీని కలుసుకోవడానికి మాథ్యూస్ ముంబాయి నుంచి చండీగఢ్ వెళ్లడం చర్చనీయాంశం అయ్యింది.
అంతేకాదు తన ట్విట్టర్‌లో తనకో మంచి గర్ల్‌ఫ్రెండ్ దొరికింది. ఆమె మరెవరో కాదు నటి తాప్సీనే అంటూ మ్యాథ్యూస్ పోస్ట్ చేయడంతో వీరి మధ్య లవ్వాట మొదలైందనే ప్రచారం ఇటీవల కోలీవుడ్‌లో జోరందుకుంది. అయితే ఈ వ్యవహారంపై స్పందించాలని తాప్సీని అడగితే ఆగ్రహంతో అగ్గిమీద గుగ్గిలయ్యింది. ‘‘నా గురించి నా వ్యక్తి గత జీవితం గురించి ఇప్పటికే చాలా వదంతులు ప్రచారం చేశారు. అలాంటి వాటికి బదులిచ్చి అలసిపోయూను. ఇకపై ఎలాంటి గ్యాసిప్స్ కు సమాధానం చెప్పేది లేదు. ఇతరులతో నన్ను చేరుస్తూ రాయడానికి అంతం లేదా? ఇలా నేనెంతమందిని ప్రేమిస్తాను. రోజుకో కథ రాస్తున్నారు’’ అంటూ తాప్సీ రుసరుసలాడుతోంది. నిప్పులేనిదే పొగరాదని ఈమె ఎరుగదేమో!
Advertisement
Advertisement