డి సినిమాతో ఖర్చు తక్కువ  | Telangana State Film Development Corporation | Sakshi
Sakshi News home page

డి సినిమాతో ఖర్చు తక్కువ 

Published Wed, Jun 6 2018 12:31 AM | Last Updated on Wed, Jun 6 2018 12:31 AM

Telangana State Film Development Corporation - Sakshi

తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టిఎస్‌ఎఫ్‌డీసీ) చైర్మన్‌ పి.రామ్మోహన్‌ రావు అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్‌లోని టిఎస్‌ఎఫ్‌డీసీ కార్యాలయంలో పలువురు నిర్మాతలు సమావేశమయ్యారు. ఈ సమావేశం వివరాలతో ఎఫ్‌డీసీ చైర్మన్‌ పర్సనల్‌ సెక్రటరీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్యూబ్, యు.ఎఫ్‌.ఓ. డిజిటల్‌ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు భారీ ఖర్చు భరించాల్సి వస్తోంది. ప్రస్తుత ధరల్లో సగం కన్నా తక్కువ ఖర్చులోనే హాలీవుడ్‌లో వాడే అత్యాధునిక ‘డి’ సినిమా పరిజ్ఞానాన్ని ‘డిజిక్వెస్ట్‌’ సంస్థ రూపొందించింది. ప్రస్తుతం క్యూబ్, యు.ఎఫ్‌.ఓ. సంస్థ లు తక్కువ క్వాలిటీ ఉన్న ‘ఈ’ సినిమాని ప్రేక్షకులకు అందిస్తున్నాయి. 2కే, 4కే, 8కే హై క్వాలిటీ ‘డి’ సినిమా ప్రొజెక్షన్‌ కోసం డిజిక్వెస్ట్‌ వారు ప్రత్యేకంగా రూపొందించారు. ఈ టెక్నాలజీలో హై ఎండ్‌ సర్వర్‌తో పాటు హై ఎండ్‌ లేజర్‌ ప్రొజెక్టర్‌ని ఉపయోగిస్తారు.

మామూలు ప్రొజెక్టర్‌ లైఫ్‌ 700నుంచి 1200 గంటలు ఉంటే, లేజర్‌ ప్రొజెక్టర్‌ లైఫ్‌ 20, 000 గంటలు ఉంటుంది. మామూలు లాంప్‌ మార్చేందుకు 90,000 ఖర్చు అయ్యేది. లేజర్‌ ప్రొజెక్షన్‌ లాంప్‌ ద్వారా ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. అలాగే పైరసీ జరిగితే ఒక్క నిమిషం ఫుటేజీ శాంపిల్‌ చెక్‌ చేసి ఏ థియేటర్‌లో, ఏ షోకి పైరసీ జరిగిందన్నది నిమిషాల్లోనే చెప్పడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. వచ్చే వారం మళ్లీ సమావేశం నిర్వహించి, తెలంగాణ ప్రభుత్వానికి నివేదికలు అందించనున్నారు. ఈ టెక్నాలజీపై డిజిక్వెస్ట్‌ సంస్థ చైర్మన్, తెలుగు ఫిలిం చాంబర్‌ ఉపాధ్యక్షుడు కొత్త బసిరెడ్డి ప్రెజంటేషన్‌ ఇచ్చారు. నిర్మాతలు కె.ఎల్‌.నారాయణ, సి.కల్యాణ్, విజయేందర్‌ రెడ్డి, దామోదర్‌ ప్రసాద్, రామదాసు, వల్లూరిపల్లి రమేశ్, డిజిక్వెస్ట్‌ ఇండియా డైరెక్టర్‌ పిఎల్‌కె రెడ్డి, టీఎఫ్‌సీసీ ఈసీ మెంబర్‌ బాలగోవింద్‌ రాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement