Telangana State Film Chamber of Commerce
-
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
‘‘తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎస్ఎఫ్సీసీ) అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నవారికి కృతజ్ఞతలు. గత ఏడాది కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ అసోసియేషన్‌కి పూర్తి సమయం కేటాయించలేకపోయాను.. ఈ ఏడాది కచ్చితంగా సమయం కేటాయించి అందరితో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను’’ అని నిర్మాత సునీల్ నారంగ్ అన్నారు. కొత్తగా ఎన్నికైన ‘తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి’ పాలక మండలిని శనివారం ప్రకటించారు. ‘టీఎస్ఎఫ్సీసీ’ అధ్యక్షునిగా సునీల్ నారంగ్ ఎన్నికవగా, ఉపాధ్యక్షులుగా వీఎల్ శ్రీధర్, వాసుదేవ రావు చౌదరి, సెక్రటరీగా కె. అనుపమ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా బాలగోవింద్ రాజ్ తడ్ల, ట్రెజరర్‌గా చంద్ర శేఖర్ రావు ఎన్నికయ్యారు. అలాగే 15 మంది ఈసీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం మాట్లాడుతూ–‘‘టీఎస్ఎఫ్సీసీ’ పాలక మండలి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. అందరూ చిత్ర పరిశ్రమ, కార్మికుల అవసరాలకు అనుగుణంగా పని చేయాలి’’ అన్నారు. ఇంకా నిర్మాతల మండలి అధ్యక్షుడు కేఎల్ దామోదర్ ప్రసాద్, కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడారు. -
‘అక్టోబరు 30లోపు ఓటీటీకి సినిమాలు అమ్ముకోవద్దు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఫిల్మ్‌చాంబర్ ప్రతినిధులు శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఈ క్రమంలో.. నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫాంకి ఇవ్వొద్దని ఎగ్జిబిటర్లు తీర్మానించారు. లాక్డౌన్ ఎత్తివేసిన నేపథ్యంలో... జూలై చివరినాటికి థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉన్నందున అక్టోబర్ 30 వరకు ఓటీటీలకు సినిమాలు ఇవ్వొద్దని పేర్కొన్నారు. తొందరపడి సినిమాలను అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా... నిర్మాతలు సినిమాలను థియేటర్లో విడుదల చేయకుండా ఓటీటీలో ప్రదర్శించడం అంటే సినీ ఇండస్ట్రీలో ఒక ముఖ్యమైన విభాగాన్ని దెబ్బతీయడమేనని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అభిప్రాయపడింది. తమ విజ్ఞప్తిని ఖాతరు చేయని నిర్మాతల పట్ల భవిష్యత్తులో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జూలై 7న తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ జనరల్ బాడీ సమావేశం జరపాలని నిర్ణయం తీసుకుంది. సినీ పరిశ్రమ విస్తృత ప్రయోజనాల రీత్యా నిర్మాతలు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. -
డి సినిమాతో ఖర్చు తక్కువ
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టిఎస్ఎఫ్డీసీ) చైర్మన్ పి.రామ్మోహన్ రావు అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్‌లోని టిఎస్ఎఫ్డీసీ కార్యాలయంలో పలువురు నిర్మాతలు సమావేశమయ్యారు. ఈ సమావేశం వివరాలతో ఎఫ్డీసీ చైర్మన్ పర్సనల్ సెక్రటరీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్యూబ్, యు.ఎఫ్.ఓ. డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు భారీ ఖర్చు భరించాల్సి వస్తోంది. ప్రస్తుత ధరల్లో సగం కన్నా తక్కువ ఖర్చులోనే హాలీవుడ్లో వాడే అత్యాధునిక ‘డి’ సినిమా పరిజ్ఞానాన్ని ‘డిజిక్వెస్ట్’ సంస్థ రూపొందించింది. ప్రస్తుతం క్యూబ్, యు.ఎఫ్.ఓ. సంస్థ లు తక్కువ క్వాలిటీ ఉన్న ‘ఈ’ సినిమాని ప్రేక్షకులకు అందిస్తున్నాయి. 2కే, 4కే, 8కే హై క్వాలిటీ ‘డి’ సినిమా ప్రొజెక్షన్ కోసం డిజిక్వెస్ట్ వారు ప్రత్యేకంగా రూపొందించారు. ఈ టెక్నాలజీలో హై ఎండ్ సర్వర్‌తో పాటు హై ఎండ్ లేజర్ ప్రొజెక్టర్‌ని ఉపయోగిస్తారు. మామూలు ప్రొజెక్టర్ లైఫ్ 700నుంచి 1200 గంటలు ఉంటే, లేజర్ ప్రొజెక్టర్ లైఫ్ 20, 000 గంటలు ఉంటుంది. మామూలు లాంప్ మార్చేందుకు 90,000 ఖర్చు అయ్యేది. లేజర్ ప్రొజెక్షన్ లాంప్ ద్వారా ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. అలాగే పైరసీ జరిగితే ఒక్క నిమిషం ఫుటేజీ శాంపిల్ చెక్ చేసి ఏ థియేటర్లో, ఏ షోకి పైరసీ జరిగిందన్నది నిమిషాల్లోనే చెప్పడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. వచ్చే వారం మళ్లీ సమావేశం నిర్వహించి, తెలంగాణ ప్రభుత్వానికి నివేదికలు అందించనున్నారు. ఈ టెక్నాలజీపై డిజిక్వెస్ట్ సంస్థ చైర్మన్, తెలుగు ఫిలిం చాంబర్ ఉపాధ్యక్షుడు కొత్త బసిరెడ్డి ప్రెజంటేషన్ ఇచ్చారు. నిర్మాతలు కె.ఎల్.నారాయణ, సి.కల్యాణ్, విజయేందర్ రెడ్డి, దామోదర్ ప్రసాద్, రామదాసు, వల్లూరిపల్లి రమేశ్, డిజిక్వెస్ట్ ఇండియా డైరెక్టర్ పిఎల్కె రెడ్డి, టీఎఫ్‌సీసీ ఈసీ మెంబర్ బాలగోవింద్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
వాటికి డబ్బు చెల్లించి... మోసపోవద్దు!
‘ది హైదరాబాద్ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్’ 1941 నవంబర్ 17న ప్రారంభమైంది. ఈ సంస్థను 2014లో ‘తెలంగాణా స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌గా’ మార్చారు. ఈ సంస్థకు గురువారంతో 75 ఏళ్లు (ప్లాటినం జూబ్లీ) పూర్త య్యాయి. ఈ సందర్భంగా ఆ కమిటీ అధ్యక్షుడు పి.రామ్మోహన రావు, కార్యదర్శి కె. మురళీ మోహనరావు అధ్యక్షతన కార్యవర్గ సభ్యుల సమావేశం జరిగింది. వారు మాట్లాడుతూ- ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక గుర్తింపు పొందిన సంస్థ ఇది. ఇప్పటి వరకూ 3382 మంది సభ్యులున్నారు. తెలంగాణ ప్రభుత్వం సినీసీమకు అందించే సేవలు, లబ్ధి పొందా లంటే ఈ సంస్థలో సభ్యత్వం ఉండాలి. తెలం గాణ పేరిట ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొచ్చిన ఏ ఇతర సంస్థలకీ ప్రభుత్వ గుర్తింపు లేదు. వాటిల్లో సభ్యత్వం కోసం డబ్బు చెల్లించి మోసపోవద్దు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ప్రభుత్వ ఉన్నతాధికారి నవీన్ మిట్టల్ దృష్టికి పలు అంశాలు తీసుకెళ్లాం’’ అన్నారు.