‘దాసరి లేరనకండి.. వింటారు...’
హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణరావు మరణం పట్ల యావత్ దక్షిణాది సినిమా పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమలో ‘పెద్దాయన’గా వెలుగొందిన దాసరికి ఘన నివాళులు అర్పిస్తోంది.
దాసరి చనిపోతేదని విశ్రాంతి తీసుకుంటున్నారని దర్శకుడు జాగర్లమూడి క్రిష్ తన నివాళి సందేశంలో పేర్కొన్నారు. గురూ గారికి మరణం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘గుండె ఆడకపోతే ఏం? దాసరి గారి సినిమా ఆడుతూనే ఉంటుందిగా. ధియేటర్‌లోనో, టీవీ చానెల్స్‌లోనో.. తాతా మనవడు నుంచి 151 సినిమాలున్నాయి. ఆడుతూనే ఉంటాయి. భూమ్మీద సినిమా అనేది లేనప్పుడు దాసరిగారు లేరనాలి. అది జరగదుకదా. దాసరి గారంటే 74 ఏళ్లు నిండిన వ్యక్తి కాదు, 24 శాఖలు కలిసిన శక్తి. ఇలాంటి వారికి జయ జయ ద్వానాలు ఉంటాయి. కానీ జోహార్లు ఉండవు. దర్శకుడే సినిమాకి కెప్టెన్ అని ఎక్కడ ఎవరంటున్నా దాసరిగారు వింటారు. ఏ తెలుగు దర్శకుడికి ఏ గౌరవం దక్కినా అందులో దాసరిగారు ఉంటారు. పెద్దాయన విశ్రాంతి తీసుకుంటున్నారు. లేరనకండి, వింటారు’ అని క్రిష్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
‘శకాలు అంతరించిపోవచ్చు కానీ దిగ్గజాలు చిరస్థాయిగా జీవించే ఉంటార’ని దర్శకుడు పూరి జగన్నాథ్ ట్వీట్ చేశారు. దాసరి నారాయణరావు దిగ్గజమని, ఆయన మరణం తెలుగు సినిమా పరిశ్రమకు పూడ్చలేని లోటని మరో దర్శకుడు అనిల్ రావిపూడి పేర్కొన్నారు. తెలుగు సినిమా ఒక లెజెండరీ దర్శకుడిని కోల్పోయిందని దర్శకుడు హరీశ్ శంకర్ అన్నారు.
(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)