కోలీవుడ్‌లో గౌండ్రమణి, సెంథిల్ తరం తరువాత సినిమాల్లో హాస్యాన్ని మరో కోణంలో ప్రేక్షకుల ముందుంచి పరవశింపజేసిన నటుడు వడివేలు. అలాంటి నటుడి వినోదానికి ఇక పుల్‌స్టాప్ పడినట్లేనా? పరిస్థితులు గమనిస్తే అలానే అనిపిస్తోంది. హాస్య నటుడి నుంచి కథానాయకుడి స్థాయికి అంచెలంచెలుగా ఎదిగిన నటుడు వడివేలు. ఈ కామెడీ నటుడ్ని హీరోగా పరిచయం చేసింది దర్శకుడు శంకర్. ఆయనే వడివేలు హాస్య శకానికి ముగింపు పలికేలా ఉన్నారు.
ఇందుకు వడివేలు స్వయంకృపరాధం కారణం అంటున్నారు. ఆ కథేంటో తెలుసుకోవాలనుందా?. స్టార్ దర్శకుడు శంకర్ నిర్మాతగా ఆయన శిష్యుడు శింబదేవన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ఇంసైఅరసన్ 23ఆమ్ పులికేసి. ఈ చిత్రం ద్వారా హాస్య నటుడు వడివేలును కథానాయకుడిగా పరిచయం చేశారు. చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆ తరువాత వడివేలు కొన్ని చిత్రాల్లో హీరోగా నటించినా అవి బాక్సాపీస్ వద్ద పడకేశాయి. కాగా శంకర్ మళ్లీ హింసై ఆరసన్ 23 ఆమ్ పులికేసి చిత్ర యూనిట్‌తో దానికి సీక్వెల్ నిర్మించ తలపెట్డారు. చిత్రం కోసం భారీ సెట్లు వేసి షూటింగ్‌ను మొదలెట్టారు. కొన్ని రోజులు సవ్యంగా సాగిన షూటింగ్ అనివార్య కారణాల వల్ల ఆగింది. అంతే ఆ ఆగడం ఇప్పటి వరకూ మళ్లీ జరగలేదు. ఇందుకు వడివేలు కాల్‌షీట్స్ కేటాయించక పోవడమే కారణంగా దర్శకుడు శంకర్ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు.
మండలి వడివేలకు నోటీసులు పంపి వివరణ కోరింది. అందుకు వడివేలు తన కాల్‌షీట్స్‌ను పులికేసి చిత్ర యూనిట్ వృథా చేశారన్నారు. ఆ చిత్రం కారణంగా తాను చాలా అవకాశాలను వదులకోవలసి వచ్చిందని వివరణ ఇచ్చారు. మళ్లీ నటించాలంటే అధనంగా పారితోషికాన్ని డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. శంకర్ తన చిత్రాన్ని పూర్తి చేయకపోతే తాను ఇప్పటి వరకూ ఖర్చు చేసిన రూ. 9 కోట్లను వడివేలు తనకు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీన్ని నిర్మాతల సంఘం దృఢ పరచడంతో వడివేలు షాక్ అయ్యాడు.
దీంతో తను పులికేసి చిత్రంలో మళ్లీ నటించడం మినహా మరో దారి లేదని చాలా మంది అనుకున్నారు. వడివేలు మాత్రం తాను ఆ చిత్రంలో నటించేది లేదని ఖరాఖండీగా చెప్పాడు. దీంతో నిర్మాతల సంఘం పులికేసి 2 చిత్రాన్ని పూర్తి చేసేవరకూ ఇతర ఏ చిత్రంలోనూ నటించరాదని వడివేలుపై రెడ్ కార్డ్ ప్రకటించినట్లు సమాచారం. ఈ విషయమై వడివేలును సంప్రదించగా ఆయన ఈ విషయమై తనకు నిర్మాతల మండలి నుంచి ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతానికి వడివేలు ఏ చిత్రంలోనూ నటించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment