
సాక్షి, హైదరాబాద్ : తన అందం అభినయంతో సినీ ప్రేక్షక లోకాన్ని అలరించిన లెజండరీ నటి, అతిలోక సుందరి శ్రీదేవి (54) హఠాన్మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. 1980 దశకంలో శ్రీదేవి అంటే యువతలో విపరీతమైన క్రేజ్ ఉండేదని తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ఈ రోజు ఉదయం ఓ ఫోన్ కాల్ తో నిద్ర లేచాను. ఫోన్ ఎత్తగానో టీవీ చూశారా అన్నారు. లేదనడంతో శ్రీదేవి గారు మృతిచెందారు అని చెప్పారు. ఆ షాక్ నుండి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నప్పటి నుంచి ఇటీవల మామ్ సినిమా వరకు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
అప్పట్లో ఆమెకు ఎంత క్రేజ్ ఉండేదంటే..
నేను చదువు ముగించుకొని సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలి నాళ్లలో దుబాయి నుంచి ఓ స్నేహితుడు ఫోన్ చేశాడు. శ్రీదేవిని చూడటానికి రూ. 2 లక్షలు ఇస్తానన్నాడు. షూటింగ్ లో జస్ట్ చూపిస్తే చాలు.. పరిచయం కూడా చేయనక్కర్లేదన్నాడు. ఆ రోజుల్లో(1980 దశకంలో) రూ. 2 లక్షలు ఇస్తానన్నడంటే యువతలో శ్రీదేవికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
శ్రీదేవి సినిమాలకు దూరంగా ఉండి, చాలా ఏళ్ల గ్యాప్ తీసుకుని ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాలో నటించినా శ్రీదేవి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని తమ్మారెడ్డి అన్నారు. కొత్త హీరోయిన్లందరూ శ్రీదేవిని అనుకరించాలని చూస్తుంటారని, క్రమశిక్షణ, ప్రొఫెషనలిజంలోనూ ఆమెను ఫాలో అయితే బాగుంటుందని సూచించారు. శ్రీదేవి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్నారు. ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment