
అందుకే దృశ్యకావ్యం బాగా నచ్చింది
బెల్లం రామకృష్ణారెడ్డి
‘దృశ్యకావ్యం’ సినిమా దర్శకునిగా నా తొలి ప్రయత్నం. అయినా ప్రేక్షకులు కొత్తా పాతా అనే తేడా చూపకుండా నా ప్రయత్నాన్ని ఆదరించారు. అందుకు వారికి నా కృతజ్ఞతలు’’ అని బెల్లం రామకృష్ణారెడ్డి అన్నారు. కార్తీక్, కశ్మీర జంటగా స్వీయ దర్శకత్వంలో బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన ‘దృశ్యకావ్యం’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతున్న సందర్భంగా బెల్లం రామకృష్ణారెడ్డి చెప్పిన విశేషాలు...
నేనీ సినిమా కోసం అనుకున్న స్క్రిప్ట్ వేరు... తీసిన సినిమా వేరు. నేను షూటింగ్ స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకున్నాక ‘రాజుగారి గది’ విడుదలైంది. అందుకే ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటే బాగుంటుందనుకున్నాను. పోస్టర్స్ ద్వారానే ఈ సినిమా ఎలా ఉంటుందో చెప్పాలనుకున్నాను. అందుకే, పోస్టర్స్‌లో దెయ్యాన్ని చూపించాను. దాంతో ఇది హారర్, థ్రిల్లర్ మూవీ అని ఫిక్స్ అయి ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చారు. దెయ్యాన్ని పోస్టర్స్‌లో చూసి, సినిమాకు వచ్చిన వాళ్లల్లో కొంత మంది నిరాశ చెందిన మాట వాస్తవమే. వాళ్ల సంగతలా ఉంచితే, ఈ సినిమా చూసి నాకు తెలిసిన వాళ్లు, తెలియనవాళ్లు ఫోన్ చేసి నన్ను అభినందిస్తున్నారు. నేను స్వయంగా థియేటర్‌కు వెళ్లి సినిమా చూశాను. సెంటిమెంట్ సీన్స్‌కు బాగా కనెక్ట్ అవుతున్నారు.
ఈ సినిమాలో చిన్నపిల్లలను చూస్తూ ఉంటే తమ ఇంట్లోవాళ్లను చూస్తున్నట్టే అనిపిస్తోందని చాలామంది అన్నారు. ఆ విషయాన్ని కొంత మంది నా దగ్గర ప్రస్తావించారు కూడా. హీరో శ్రీకాంత్‌గారు కూడా నా ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. నేను దేనికైతే ప్రేక్షకులు రియాక్ట్ అవుతారనుకున్నానో, దానికే కనెక్ట్ అయ్యారు. హీరోయిన్ దృక్కోణంలో సినిమా చూపించడం చాలా మందికి బాగా నచ్చింది. ముఖ్యంగా సంగీత దర్శకుడు ‘ప్రాణం’ ఫేమ్ కమలాకర్ స్వరపరిచిన ఫ్లూట్ బిట్ అయితే చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు.
దర్శకుణ్ణి కావాలనే కోరికతోనే సినీ పరిశ్రమలో అడుగుపెట్టాను. నిర్మాతగా నాకిది మూడో చిత్రం. ‘భద్రమ్’ అనే తమిళ డబ్బింగ్ చిత్రం తర్వాత శ్రీకాంత్ హీరోగా ‘వీడికి దూకుడెక్కువ’ అనే చిత్రాన్ని నిర్మించాను. కానీ, ఆ చిత్రం విషయంలో డిస్ట్రిబ్యూటర్లు కొంత నిరాశ వ్యక్తం చేశారు. ఇక... నా లాంటి కొత్తవాళ్లు దర్శకత్వం వహించే చిత్రాలను ఎవరు చూడరు కదా. అందుకే ఎవరికీ నష్టం కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని నేనే స్వయంగా పంపిణీ చేశాను.
‘దృశ్యకావ్యం’ కథకు మంచి స్కోప్ ఉంది. చివరికి ఎవరు చనిపోయారు? అనే విషయాన్ని రివీల్ చేశాక, దానికి తగ్గ కారణాలను కూడా డిస్కస్ చేయాలి. అందుకే ఫుల్ కన్‌క్లూషన్ ఇవ్వకుండా సీక్వెల్ తీస్తామని ప్రకటించాను. అయితే ఈ సినిమా తర్వాత వెంటనే మళ్లీ అదే జానర్‌లో సినిమా వస్తే కొత్త దర్శకుణ్ణి కాబట్టి నా మీద ఓ ముద్ర పడిపోతుంది. అందుకే సీక్వెల్‌ని ఇప్పట్లో తీయదల్చుకోలేదు. కొంత గ్యాప్ ఇచ్చి తీస్తాను.
ప్రస్తుతం నా దగ్గర మూడు, నాలుగు కథలున్నాయి. నిఖిల్, సాయిధరమ్‌తేజ్‌లతో సినిమాలు చేద్దామనుకుంటున్నా. ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే అన్ని వివరాలూ వెల్లడిస్తాను.