ఈ భూమ్మీద అంతకంటే నరకం ఏముంటుంది!
ముంబై: ఎంతో కష్టపడి నటించిన సినిమా బాక్సాఫీసు దగ్గర ఫెయిలైతే తట్టుకోవడం చాలాకష్టమన్నాడు బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్. తన సినిమా బాక్సాఫీసు దగ్గర ఓటమిని చవిచూస్తే చాలా బాధగా ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఒక్కసారి సినిమా ఫెయిల్ అయితే ఇక జనం మనతో మాట్లాడ్డం తగ్గిస్తారన్నాడు. ఆ సమయంలో అసలు నువ్వు ఎవరి కొడుకు లాంటివేవీ పనిచేయవని తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు బిగ్ బి వారసుడైన అభిషేక్. ఎంత నిబద్ధతతో పనిచేసినా ఫలితం నెగెటివ్గా ఉంటే కస్టమేనన్నాడు.
ఎన్నో ఆశలతో తీసిన సినిమా సక్సెస్ కాకపోతే ఈ భూమ్మీద అంత కంటే నరకం మరోటి ఉండదని అభిప్రాయపడ్డాడు. అది మనల్ని పట్టి పీడిస్తుందని, మనిషిగా చంపేస్తుందన్నాడు. మర్నాడు ప్రపంచం మొఖం చూడటం చాలా కష్టమని తెలిపారు. ఈ ఫీలింగ్ మనిషిలోని అంతర్గత సామర్ధ్యాన్ని కుంగదీస్తుందని అయినా తలవంచక తప్పదన్నాడు. చాలా మంది నటులు సినిమా వైఫల్యానికి అనేక కారణాలు వెతుకుతారని కానీ తాను అలా కాదన్నాడు. ఎక్కడా ఆవేశ పడకుండా వాస్తవాన్ని అంగీకరించాలన్నాడు..
సినిమాల కోసం చాలా పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చిస్తున్నమాట నిజమేనని, ఏ నటుడూ సినిమా ఫ్లాప్ కావాలని కోరుకోడని వ్యాఖ్యానించారు. తను సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటానని చెప్పారు. బాలీవుడ్లో వరుస ఫ్లాప్ లతో ఏటికి ఎదురీతుతున్న హీరో ఎవరంటే అది కచ్చితంగా అభిషేక్ బచ్చనే అంటాయి బాలీవుడ్ వర్గాలు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, నటి జయాబచ్చన్ ల కుమారుడైన అభిషేక్ కెరీర్లో హిట్ ల కంటే ఫట్ లే ఎక్కువ. మేష్ శుక్లా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఆల్ ఈజ్ వెల్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అభిషేక్.