చిరంజీవి లుంగీ డ్యాన్స్ అదిరింది... వెంకటేశ్ స్టెప్పులు సింప్లీ సూపర్... మోహన్‌లాల్ మ్యాజిక్ వర్కవుట్ అయ్యింది...
జయసుధ, సుమలత, సుహాసిని, రాధిక, రాధ తదితర నటీమణుల హంగామాకి హద్దే లేకుండాపోయింది. ఇంతకీ ఈ సందడంతా జరిగింది ఎక్కడో తెలుసా? చెన్నయ్ మహానగరంలో. అక్కడి ఆలివ్ బీచ్‌లో గల నీనా రెడ్డి గెస్ట్ హౌస్‌లో. మొత్తం 34 మంది నటీనటుల ఆట, పాటలతో, జోక్స్‌తో, కామెడీ స్కిట్స్‌తో ఆ గెస్ట్ హౌస్ ఓ కొత్త శోభను సంతరించుకుంది. 1980లో వెండితెరను ఏలిన నాయకా నాయికలంతా ఐదేళ్లుగా ‘ఎయిటీస్ రీ యూనియన్’ పేరుతో ప్రతి ఏడాదీ కలుసుకుంటున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ రంగానికి చెందిన తారలు కలుసుకుని పండగ చేసుకుంటారు.
ఈ ఏడాదికి సంబంధించిన ఈ సెలబ్రేషన్స్ చెన్నయ్‌లో జరిగాయి. సుమన్, సీనియర్ నరేశ్, మోహన్, ప్రభు, శరత్‌కుమార్, జయరామ్, భానుచందర్, సరిత, లిజి, రేవతి, రమ్యకృష్ణ, శోభన... ఇలా పలువురు తారలు హాజరయ్యారు. కాగా, ప్రతి ఏడాదీ బాలకృష్ణ కూడా హాజరవుతుంటారని, ఈసారి షూటింగ్ కోసం బల్గేరియా వెళ్లడం వల్ల రాలేదని, దాంతో సెలబ్రేషన్స్ ఇన్‌కంప్లీట్‌గా అనిపించిందని ఖుష్బూ పేర్కొన్నారు. ఈసారి తమ పార్టీకి కొత్త అతిథులు కూడా వచ్చారని ఆమె పేర్కొన్నారు.
హిందీ నటుడు జాకీ ష్రాఫ్, నటి పూనమ్ ధిల్లాన్ కూడా ఈ సౌత్ స్టార్స్ రీ-యూనియన్‌లో పాల్గొని ఎంజాయ్ చేశారు. ఈ నెలలోనే పుట్టిన రోజులు జరుపుకున్న చిరంజీవితో పాటు మరో ఆరుగురితో కేక్ కట్ చేయించారు. ఖుష్బూ, సుహాసిని, లిజీ 10 రోజుల పాటు కష్టపడి ఈ సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ‘మౌలిన్ రోగ్’ అనే థీమ్‌తో జరిగిన ఈ పార్టీలో తారలందరూ రెడ్ అండ్ బీజ్ కలర్ డ్రెస్సుల్లో కళకళలాడారు. కేవలం డ్రెస్‌లు మాత్రమే కాదు.. ఆ పార్టీ కోసం వాడిన వస్తువులన్నీ దాదాపు ఎరుపురంగులో ఉండేట్లు చూసుకున్నారు. తారలందరూ తమ స్టార్ స్టేటస్‌ని పక్కన పెట్టి, హ్యాపీగా ఎంజాయ్ చేశారు. కొసమెరుపు ఏంటంటే.. ఈ పార్టీలో లుంగీ డ్యాన్స్ కోసం హీరోలు కట్టుకున్న లుంగీలను జాకీ ష్రాఫ్ తీపి గుర్తుగా ముంబయ్ తీసుకెళ్లారు.