పెద్ద మనిషి
‘పెదరాయుడు’ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మోహన్‌బాబుతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ...
‘పెదరాయుడు’ మూడు విషయాలు చెప్పింది...
అన్నదమ్ములు ఎలా ఉండాలి? భార్యాభర్తలు ఎలా మెలగాలి? సమన్యాయం ఎలా పాటించాలి?...
ఈ సూత్రాలనే ఈ పెద్దమనిషి పాటిస్తున్నాడు.. నష్టం వస్తే డబ్బు పోతుంది... అప్పుడు జీవితం మొదలుపెట్టిన పూరి గుడిసెకే మళ్లీ వెళ్లొచ్చు.. కానీ, డబ్బు దాచిపెట్టుకుని, మోసం చేస్తే మన గుండెల్లో మనమే ఉండలేం అంటారు ఈ పెద్దమనిషి.
‘పెదరాయుడు’ ప్రారంభమైన వైనం?
‘తమిళంలో ‘నాట్టామై’ అనే చిత్రం విడుదలైంది. చూడరా...’ అని రజనీకాంత్ అంటే. ‘ఎందుకురా’ అన్నా. ‘నువ్వు ముందు చూడరా’ అన్నాడు. చూసి, ‘బాగుంది’ అన్నాను. ‘ఆ చిత్రాన్ని తెలుగులో చేస్తే బాగుంటుంది. తమిళ నిర్మాతతో నువ్వు మాట్లాడుకో. డబ్బు సంగతి నాకు సంబంధం లేదు. కానీ, తెలుగులో తీస్తే మాత్రం గొప్పగా ఆడుతుంది’ అన్నాడు. సరే.. రీమేక్ రైట్స్ తీసుకున్నాను. ఆ తర్వాత రజనీ, ‘ఈ సినిమాలో ఉన్న పాపారాయుడు పాత్ర నేను వేస్తాను రా’ అన్నాడు. ‘అది చిన్న పాత్ర కదరా..’ అంటే.. ‘కాదురా.. నేను చేస్తా’నంటూ గెటప్ వేసుకొచ్చి మరీ చూపించాడు. మంచి స్నేహానికి ఇంతకన్నా నిదర్శనం ఏం ఉంటుంది?
ఈ చిత్రానికి సంబంధించి మర్చిపోలేని విషయం ఏదైనా?
ప్రతిరోజూ గుర్తుంచుకోదగ్గదే. షూటింగ్ మొదలుపెట్టిన రోజునే నేను గుర్రం మీద నుంచి పడిపోయాను. నడుముకి దెబ్బలు తగులుతాయని భయపడ్డాను కానీ, మెడకి దెబ్బ తగిలింది. ఇలా షూటింగ్ సమయంలో చాలా గాయాలయ్యాయి. ఎంతో కష్టపడి చేశాం.
ఈ చిత్రవిజయానికి కారణాలు?
అద్భుతమైన కథ, దానికి తగ్గ నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదరడంవల్లే మంచి విజయం సాధించగలిగాం. చిత్రదర్శకుడు పినిశెట్టి రవిరాజా నాకు బాగా నచ్చిన వ్యక్తి. కెమెరామ్యాన్ పీఎస్ ప్రకాశ్ ఇప్పుడు లేరు. ఆయన వండర్‌ఫుల్. కోటిగారు మంచి పాటలిచ్చారు. ‘కదిలే కాలమా..’ నేను ఇష్టపడి పెట్టిన పాట. బాగుంటుందో లేదోనని రవిరాజా అంటే, లేదు బాగుంటుందన్నాను.
‘పెదరాయుడు’ సమయంలో మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, సినిమా రిజల్ట్ తేడా అయితే సమస్యలపాలయ్యేవారని కొంతమంది అంటుంటారు?
ఈ సినిమా అప్పుడు ఆర్థిక ఇబ్బందులేవీ లేవు. ‘మేజర్ చంద్రకాంత్’ అప్పుడు మాత్రం ఇబ్బందుల్లో ఉన్నాను. దాంతో, ‘ఇప్పుడు నాతో సినిమా ఎందుకు? వద్దు?’ అని అన్నగారు తారక రామారావుగారు అన్నారు. ఆయనతో సినిమా తీయాలనేది నా పట్టుదల. అందుకని, ఆయన చెప్పినా కూడా వినకుండా మొండిగా, పట్టుదలగా ఆ సినిమా తీశాను. ఏ స్థాయిలో ఆడిందో తెలిసిందే. ఆర్థిక లాభాలను కూడా తెచ్చిపెట్టింది.
మీ కెరీర్‌లో ఆర్థికపరమైన రిస్కులు చాలానే తీసుకున్నారు.. నటుడిగా కష్టపడి సంపాదించిన డబ్బుని నిర్మాతగా పోగొట్టుకోవాల్సి వచ్చినప్పుడు భయం అనిపించలేదా?
నా కెరీర్ ఆరంభించినప్పట్నుంచీ ఇప్పటివరకూ వెనకడుగు వేసిన సందర్భాలు లేనే లేవు. ‘పూరి గుడిసె నుంచి బంగ్లా స్థాయికి వచ్చాం.. ఒకవేళ అనుకోనిది ఏమైనా జరిగితే మళ్లీ పూరి గుడిసెకే వెళతాం.. అయితే ఏంటి?’ అనుకునేవాణ్ణి. మహా అయితే సంపాదించిన డబ్బు పోతుంది? డబ్బు లేదు అంటారు కానీ.. మోసగాడు అని ఎవరూ అనరు కదా.
మీ ముగ్గురు పిల్లలు లక్ష్మీప్రసన్న, విష్ణు, మనోజ్‌లో మీ పట్టుదల, మొండితనం ఎవరికి బాగా వచ్చాయి?
విష్ణు ఆచి తూచి అడుగులేస్తాడు. బాగా చదువుకున్నాడు. ఇంటలెక్చువల్. మనోజ్ చాలా సెన్సిటివ్. లక్ష్మీప్రసన్న అచ్చంగా నాలానే. చాలా ముక్కుసూటిగా వ్యవహరిస్తుంది. ఇలాంటివాళ్లు సమాజంలో నెగ్గుకు రావడం కష్టం. ‘పొగరు’ అంటారు. అయినా ఫర్వాలేదు. ఎందుకంటే, ‘ఫలానావాళ్లని మోసం చేశారు’ అనే నింద మా మీద ఉండదు.
మనసులో ఏది అనిపిస్తే, అది మాట్లాడటంవల్ల వివాదాలు వస్తాయి కదా?
ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే కాంట్రవర్సీ. ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా మిన్నకుండా ఉండిపోయేవాళ్లు మన్ను తిన్న పాములతో సమానం. అలా ఉండటం మా వల్ల కాదు. బతికినంత కాలం ముక్కుసూటిగా ఉన్నామా? లేదా అన్నదే ముఖ్యం.
నాగేశ్వరరావుగారు, రామానాయుడుగారు చనిపోయాక పరిశ్రమ పెద్ద దిక్కు కోల్పోయినట్లుగా అనిపిస్తోంది...
పెద్ద దిక్కు కోల్పోయాం... నిజమే. ఇప్పుడు పరిశ్రమ పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉంది. అందరూ కలిసి కట్టుగా ఉంటే బాగుంటుంది. త్వరలో అది జరుగుతుందని ఆశిస్తున్నా.
ఏదైనా సమస్య వస్తే, ఎవరికి చెప్పుకోవాలో తెలియడంలేదని చాలామంది అంటున్నారు?
నేను చాలా సమస్యలు పరిష్కరిస్తుంటాను. ముఖ్యంగా చిన్న చిత్రాల నిర్మాతలంటే నాకు చాలా అభిమానం. వాళ్ల సమస్యలను పరిష్కరిస్తుంటాను. అలాగే, ఎవరైనా ఇబ్బందుల్లో ఉండి, పరిష్కారం కోసం వస్తే, నేను సహాయం చేస్తుంటాను.
జయాపజయాల విషయంలో మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి?
దేనికీ స్పందించను. భారతదేశంలో వరుసగా ఎనిమిది విజయాలు సాధించిన హీరో నాకు తెలిసి లేడు. అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీ, మేజర్ చంద్రకాంత్, పెదరాయుడు, రౌడీగారి పెళ్లాం, కలెక్టర్‌గారు, అడవిలో అన్న, బ్రహ్మ.. ఇలా వరుసగా ఎనిమిది హిట్ సినిమాల్లో నటించి, నిర్మించాను. వరుస ఫ్లాప్స్ కూడా చూశాను. ఇప్పుడు ఒక్క సినిమా హిట్ అయితే చాలు.. ‘ముఖ్యమంత్రి’ అయిపోయాం అనుకుంటున్నారు. ఏదైనా ఫంక్షన్‌కి భారీగా జనాలు వస్తే, ముఖ్యమంత్రి అయిపోయాం అని భ్రమపడుతున్నారు. కానీ, సినిమా విజయం సాధిస్తే ముఖ్యమంత్రి అయిపోయినట్లా?
హిందీ రంగంలో అమితాబ్ బచ్చన్‌కి ఉన్నంత స్టామినా తెలుగులో మీకు ఉంది. మరి... ఆయన చేసినట్లుగా ‘పీకు’లాంటి సినిమాలు మీరు చేయరేం?
ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా మెప్పించాను. ‘రాయలసీమ కాబట్టి నాకు భాష తెలియదు.. సంభాషణలు పలకడం తెలియదు’ అన్నారు. కానీ, తెలుగు భాషను ఎంత బ్రహ్మాండంగా పలుకుతానో, సంభాషణలు ఎలా చెపుతానో తెలిసిందే. మనకు మంచి దర్శకులున్నారు. కానీ, కథారచయితలు తక్కువగా ఉన్నారు. అందుకే ‘పీకు’లాంటి సినిమాలు ఇక్కడ రావడంలేదు. వస్తే, తప్పకుండా చేస్తా.
రాజకీయాల విషయానికొస్తే.. ఎమ్మెల్యేలను కొనడం అనే ప్రక్రియ ఎలా అనిపిస్తోంది? మీ ‘అసెంబ్లీ రౌడీ’ సినిమాలోని చాలా విషయాలు ఇప్పుడు నిజంగానే జరుగుతున్నాయి కదా?
అవును.. ఓటు వేయొద్దని భయపెడితే తిరగబడి ఓటేస్తున్నారు. ‘అసెంబ్లీ రౌడీ’లో అది చూపించాం. ఇక, ఎమ్మెల్యేలను కొనడం గురించి అంటారా? ప్రస్తుత రాజకీయాల గురించి నేనేం మాట్లాడను. అసలేం జరిగిందో తెలియకుండా మాట్లాడటం సరికాదు.
ప్రస్తుతం మీరేదైనా సినిమా చేయాలనుకుంటున్నారా?
ఓ మరాఠీ చిత్రం రీమేక్ హక్కులు తీసుకున్నా. శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తారు.
- డి.జి. భవాని