‘అంగూర్’ సినిమా అలా పుట్టింది!
కొంతమంది దర్శకులు, హీరోల మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఉంటుంది. ఆ విషయంలో దర్శకుడు గుల్జార్, హీరో సంజీవ్ కుమార్‌లది పర్‌ఫెక్ట్ కాంబినేషన్. ‘పరిచయ్’, ‘కోషిష్’, ‘మౌసమ్’, ‘ఆంధీ’ సినిమాలు చూస్తే వాళ్ల క్లోజ్‌నెస్ ఎంతలా వర్కవుట్ అయ్యిందో అర్థమవుతుంది. బేసికల్‌గా వాళ్లిద్దరూ చాలా మంచి స్నేహితులు. రెగ్యులర్‌గా కలుసుకుంటుంటారు. అప్పుడు ఆల్కహాల్‌తో పాటు ఆలోచనలను కూడా షేర్ చేసుకునేవాళ్లు. సంజీవ్‌కుమార్ గుజరాతి. సో.. వాళ్లింట్లో మందు, నాన్‌వెజ్ బ్యాన్ కాబట్టి గుల్జార్ ఇంట్లోనే సిట్టింగ్స్ ఉండేవట.
ఆ సిట్టింగ్స్‌లో హేమామాలినీ మీదున్న తన మనసు దగ్గర్నుంచి గుల్జార్ సినిమాల్లోని తన క్యారెక్టర్స్‌దాకా అన్నిటినీ గుల్జార్‌తో షేర్ చేసుకునేవారట సంజీవ్‌కుమార్. ‘మౌసమ్’ సినిమా సెట్స్ మీదున్నప్పుడే ఇలాంటి సిట్టింగ్‌లో ఒకసారి.. ‘అన్నీ వయసు మళ్లిన పాత్రలే ఇచ్చి ముప్పై ఏళ్లకే నన్ను అరవై ఏళ్ల వాడిని చేస్తున్నావ్! నీ సినిమాల్లో నాకు యంగ్ హీరో రోల్సే ఉండవా’ అని వాపోయారు సంజీవ్. ఆ మాట గుల్జార్ మనసులో బాగా నాటుకుపోయింది. సంజీవ్ కోరినట్టుగా ఆయనకు యంగ్ హీరో రోల్ ఇవ్వడానికి గుల్జార్‌కి ఆరేళ్లు పట్టింది.
ఆ సినిమా 1982లో వచ్చిన ‘అంగూర్’! సాధారణంగా గుల్జార్.. స్క్రిప్ట్ డిమాండ్‌ను ఫాలో అయ్యి ఆర్టిస్టులను ఎంపిక చేసేవారు. కానీ ఆప్తమిత్రుడి కోసం మాత్రం హీరోను దృష్టిలో పెట్టుకొని ‘అంగూర్’ స్క్రిప్ట్ రాసుకున్నారు. ఆ కామెడీ మూవీ బంపర్ హిట్ అయింది. కామెడీ జానర్‌లో బాలీవుడ్‌లో ‘అంగూర్’ని మించిన సినిమా లేదు ఇప్పటికీ.