సినిమా ఇండస్ట్రీలో చాలామంది తారలు వయసు మీద పడుతున్నా పెళ్లి ధ్యాసే ఎత్తడం లేదు. చేదు అనుభవాల వల్లనో.. అర్ధాంగి అవసరం లేదనో లైఫ్ పార్ట్‌నర్ విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు. అలా 50 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా మిగిలిపోయినవాళ్లు చాలామందే ఉన్నారు. ప్రేమ మైకంలో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకున్నవాళ్లు కూడా ఉన్నారు. అందులో ఒకరే సులక్షణ పండిత్.. ఈమె ఇప్పటితరానికి తెలిసుండకపోవచ్చు కానీ 70-80sలో మాత్రం గొప్ప హీరోయిన్.. ఆమె జీవిత కథపై ప్రత్యేక కథనం..
'ఉల్టాన్' షూటింగ్‌లో పుట్టిన ప్రేమ
సులక్షణ పండిత్.. జితేంద్ర, వినోద్ ఖన్నా, శత్రుఘ్న సిన్హ, రాజేశ్ ఖన్నా, శశి కపూర్, అమితాబ్ బచ్చన్ వంటి బడా స్టార్స్‌తో నటించింది. ఎన్నో పాటలు పాడింది. అటు నటనతో, ఇటు తన గాత్రంతో ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసింది. అయినా తనను దురదృష్టవంతురాలనే పిలిచేవారు. ఎందుకంటే ఆమె తన పాపులారిటీని మరింత పెంచుకునే ప్రయత్నాలు చేయలేదు. కెరీర్‌పై అసలు ఫోకస్ చేయలేదు. అందుకు గల కారణం.. ప్రేమ. అవును, ఆమె హీరో సంజీవ్ కుమార్‌ను మనసారా ప్రేమించింది. అతడితోనే జీవితం అని బలంగా నమ్మింది. ఉల్జాన్ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పుడే సులక్షణ అతడిపై మనసు పారేసుకుంది.
అతడి మనసులో మరొకరు
అప్పటికే సంజీవ్ మరో హీరోయిన్‌ను గాఢంగా ప్రేమిస్తున్నాడు. (ఆమె మరెవరో కాదు, హేమమాలిని అని అప్పట్లో ప్రచారం జరిగింది) తనను పెళ్లి చేసుకోవాలనీ ప్రయత్నించాడు. కానీ సదరు హీరోయిన్ అతడి పెళ్లి ప్రపోజల్‌ను రిజెక్ట్ చేసింది. అయినా ఆమె ప్రేమను గెల్చుకోవాలని పట్టువదలని విక్రమార్కుడిగా ప్రయత్నించాడు. అటు నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడంతో పిచ్చివాడయ్యాడు. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. పెళ్లనేదే లేకుండా జీవితాంతం ఒంటరిగా ఉండిపోవాలని డిసైడయ్యాడు.
బ్రహ్మచారిగా జీవితం..
ఈ నిర్ణయం సులక్షణ పండిత్‌కు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఎలాగైనా అతడిని ఒప్పించి తనతో జీవితాన్ని పంచుకోవాలనుకున్న కోరిక నెరవేరదని గ్రహించింది. తను కూడా ఎవరినీ పెళ్లి చేసుకోకుండా అతడి గురించే ఆలోచిస్తూ జీవితాన్ని గడిపేయాలని నిర్ణయించుకుంది. 1985లో 47 ఏళ్ల వయసులో సంజీవ్ కుమార్ గుండెపోటుతో మరణించాడు. అతడిని మనసులోనే భర్తగా ఊహించుకున్న సులక్షణ.. సంజీవ్ మరణాన్ని తట్టుకోలేకపోయింది. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని స్వయానా సులక్షణ సోదరి విజేత పండిత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తన సోదరి కళ్లముందే జీవచ్ఛవంలా ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయింది విజేత.
నాలుగు గోడల మధ్యే నలిగిపోతూ
2006లో ఆమెను తన ఇంటికి తీసుకొచ్చింది. అయినా తన తీరు మారలేదు. ఎవరితోనూ మాట్లాడేది కాదు, ఎవరినీ కలిసేది కాదు. ఒంటరిగా తన గదిలోనే ఉండిపోయేది. ఆ నాలుగు గోడల మధ్యే తన జీవితం నలిగిపోయింది. ఒకరోజు బాత్రూమ్‌లో కాలు జారి పడిపోవడంతో తన తుంటి ఎముక విరిగింది. దాన్ని సరిచేయించుకునేందుకు నాలుగు సర్జరీలు చేసుకుంది.. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికీ తను ఎవరి సాయం లేకుండా లేచి నడవలేని పరిస్థితి! గుడ్డిగా ప్రేమించి, మనసులోనే ప్రియుడికి గుడి కట్టి, కళ్ల ముందే తన మరణాన్ని చూసి గుండె రాయి చేసుకుని బతికింది సులక్షణ! ప్రేమ మైకంలో పడి జీవితాన్నే నాశనం చేసుకుంది.
చదవండి: యూట్యూబర్‌తో నిశ్చితార్థం.. మోకాలిపై కూర్చుని ఉంగరం తొడుగుతూ..
Comments
Please login to add a commentAdd a comment