విశాల్‌పై హత్యాబెదిరింపుల కేసు
తమిళసినిమా: నటుడు, తమిళనిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ తనపై హత్యాబెదిరింపులకు పాల్పడుతున్నారని నిర్మాత, దర్శకుడు సురేశ్ కామాక్షి స్థానిక వడపళనిలోని పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ తాను ఇటీవల జరిగిన తమిళ నిర్మాతల మండిలి ఎన్నికల్లో విశాల్ వర్గానికి పోటీగా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేశానన్నారు. అదే విధంగా నడిగర్ సంఘం, తమిళ నిర్మాతల సంఘం సమస్యలపై తాను గొంతు విప్పుతున్నానన్నారు.
అయితే నటుడు విశాల్‌కు తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విరోధం లేదన్నారు.ఇటీవల నడిగర్‌సంఘ నూతన భవన నిర్మాణంపై మద్రాస్ హైకోర్టు తాత్కాలిక నిషేధాజ్ఞలు జారీ చేసిందన్నారు. అందుకు కారణం సంఘం స్థల ఆక్రమణేనని పేర్కొన్నారు. దీంతో తాను సంఘ చర్యలను విమర్శిస్తూ తన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నానన్నారు. దీంతో విశాల్ తన అభిమానులకు తన సెల్ ఫోన్ నంబర్ ఇచ్చి హాత్యాబెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు.
ఆయన అభిమానులుగా చెప్పుకుంటున్న తమిళ నిర్మాతల సంఘ నిర్వాహకుడు రాబిన్, విశాల్ అభిమాన సంఘ అధ్యక్షుడుగా చెప్పుకుంటున్న కమల్‌కన్నన్, మరో అభిమాని తనపై రౌడీయిజానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. సురేశ్ కామాక్షి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీస్ అధికారులు దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఆయనకు హామీ ఇచ్చారు.