
అన్ని రకాల సినిమాలూ తీయాలని ఉంది!
‘‘దెయ్యం పట్టిన ఓ స్త్రీ... తన భర్త చేతుల్లోనే హత్యకు గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తీశాను. తక్కువ బడ్జెట్‌లో సినిమా తీయొచ్చనే కారణం చేతనే... హారర్ నేపథ్యాన్ని ఎంచుకున్నాను. అన్ని రకాల సినిమాలు తీయాలనేది నా లక్ష్యం’’ అని యువ దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ అన్నారు. ఆయనను దర్శకునిగా పరిచయం చేస్తూ కోటేశ్వరరావు మోరుసు నిర్మించిన చిత్రం ‘ది ఎండ్’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని దర్శకుడు ఆనందం వెలిబుచ్చారు ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ -‘‘మాది మధ్య తరగతి కుటుంబం.
స్కాలర్‌షిప్పులతో చదువుకున్నాను. చిన్నప్పట్నుంచీ కెమెరా అంటే ఇష్టం. ఆ ఇష్టమే నన్ను సినిమాల వైపు నడిచించింది. నాలుగు లఘు చిత్రాలు తీశాను. అందులో మూడు హారర్ చిత్రాలు. ఒకటి ప్రేమకథ. ఇటీవల మా టీవీ వారు నిర్వహించిన లఘు చిత్రాల కాంటెస్ట్‌లో నా లఘు చిత్రానికి ప్రథమ స్థానం లభించింది. ఆ వెంటనే అవకాశాలు కూడా తలుపు తట్టాయి. కొందరు నిర్మాతలు నన్ను కలిశారు కూడా. కానీ... ముందు ‘ది ఎండ్’ చేశాను. త్వరలో ఓ ప్రేమకథ చేయబోతున్నా’’ అని చెప్పారు.