పార్టీలకు.. అభిమానులకు అతీతమైనది సినిమా
– నందమూరి బాలకృష్ణ
సినిమా అనేది పార్టీలకు, ఫ్యాన్స్‌కు అతీతం. మనకున్న మంచి సంగీత దర్శకుల్లో అనూప్ రూబెన్స్ ఒకరు. మంచి పాటలిచ్చారు. నేనెప్పుడూ నా ప్రేక్షకులను, నా అభిమానులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తాను’’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన హీరోగా పూరి జగన్నాథ్ దర్వకత్వంలో వి.ఆనందప్రసాద్ నిర్మించిన చిత్రం ‘పైసా వసూల్’. సెప్టెంబర్ 1న విడుదల కానున్న ఈ చిత్రం ఆడియో వేడుక ఖమ్మంలో జరిగింది.
ఆడియో సీడీని దర్శకుడు బోయపాటి శ్రీను ఆవిష్కరించి, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు అందజేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ – ‘‘నువ్వు ఎవరు? అని అడిగితే భారతీయుణ్ణి అంటాను. ఇంకోసారి ఎవరు? అనడిగితే ‘తెలుగువాణ్ణి’ అని, మళ్లీ నువ్వు ఎవరు? అని అడిగితే నందమూరి తారకరామారావుగారి కొడుకుని అని చెబుతాను. మళ్లీ మళ్లీ నువ్వు ఎవరు? అనడిగితే అన్న (నందమూరి తారకరామారావు) అభిమానిని అని చెబుతాను.
ఆయన బిడ్డగా, కళాతమతల్లి బిడ్డగా రావడం ఆనందంగా ఉంది. నటీనటుల నుంచి మంచి హావభావాలు రాబట్టుకోగల సమర్థుడు పూరి. ఈ 101వ సినిమా నాకు ఒకటో సినిమాతో సమానం. ఈ సినిమా ‘రీ–లాంచింగ్ ఆఫ్ బాలకృష్ణ’ అవుతుంది. నటుడు నిత్యావసర సరుకులాంటి వాడు. ఎప్పుడూ విజ్ఞానాన్ని, వినోదాన్ని ఇస్తుండాలి. సెట్‌లో నిర్మాత మంచి వాతావరణాన్ని సృష్టించారు’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘అందరూ బాలయ్యకు కోపం అంటుంటారు.
అవును.. కోపమే. దానికి కారణం ఉంటుంది. ఆయన మాటిస్తే హరిశ్చంద్రుడు. ఎదుటివారు మాట తప్పితే విశ్వామిత్రుడు. ఆ నిజం తెలిసినవారు ఆయనతో పని చేస్తే అద్భుతాలు చూడగలరు’’ అన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘ఇన్నేళ్లుగా బాలయ్యతో ఎందుకు పని చేయలేదని బాధపడ్డాను. అంత మంచి మనిషి. కోపం వచ్చినా ముఖం మీదే. ప్రేమ వచ్చినా ముఖం మీదే. ముక్కుసూటి మనిషి. ఇది ఆయనకు 101వ సినిమా. కానీ, దూకుడు చూస్తుంటే ఫస్ట్ సినిమా అనిపించింది.
వేరే హీరోలు బయటకు వెళితే బౌన్సర్లు కావాలేమో! బాలయ్యకు అవసరం లేదు. ఫ్యాన్స్‌ను ఆయనే కంట్రోల్ చేసుకోగలరు. మీద పడుతుంటే కొడుతుంటారు. కామన్‌సెన్స్ ఏరియాలో తేడా వచ్చినప్పుడు మాత్రమే కొడతారు. ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. బాలయ్యకు, ఫ్యాన్స్‌కు ఉన్న రిలేషన్ అది. భవిష్యత్‌లో బాలయ్య ఎవరినన్నా కొడితే అది లవ్‌స్టోరి. సీరియస్‌గా తీసుకోవద్దు. కోకోకోలా పెప్సీ.. బాలయ్య బాబు సెక్సీ. సినిమా హిట్టవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు.