ఆ వార్తల్లో... నిజం లేదట! | there is no truth in that news | Sakshi
Sakshi News home page

ఆ వార్తల్లో... నిజం లేదట!

Published Fri, Mar 13 2015 10:59 PM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM

ఆ వార్తల్లో... నిజం లేదట!

ఆ వార్తల్లో... నిజం లేదట!

అక్కినేని కుటుంబం నుంచి కొత్తగా తెరపైకి వచ్చిన నట వారసుడు అఖిల్ అక్కినేని. ‘మనం’ క్లైమాక్స్‌లో ఒక చిన్న అతిథి పాత్ర ద్వారా తెరంగేట్రం చేసిన ఈ నవ యువకుడు పూర్తిస్థాయి హీరోగా ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. వి.వి. వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం షూటింగ్‌లో అఖిల్ బిజీ బిజీగా ఉన్నారు. మరో యువ హీరో నితిన్, ఆయన అక్కయ్య నిఖితా రెడ్డి తమ శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జోరుగా సాగుతోంది. అన్నపూర్ణా ఏడెకరాల్లో కుటుంబ సన్నివేశాలతో సహా కొన్ని కీలక ఘట్టాలను తీస్తున్నారు.

ఈ చిత్రంలో అఖిల్ సరసన యువ నటి సాయేషా సైగల్ వెండితెరకు పరిచయమవుతున్నారు. సుప్రసిద్ధ బాలీవుడ్ జంట సైరా బాను - దిలీప్ కుమార్‌లకు అతి సమీప బంధువు - ఈ నూతన నటి. వెలిగొండ శ్రీనివాస్ అందించిన ఈ చిత్ర కథకు  కోన వెంకట్ - గోపీమోహన్ జంట మాటలు సమకూరుస్తున్నారు. కాగా, ఈ చిత్రకథ ఒక సోషియో - ఫ్యాంటసీ అనీ, గతంలో చిరంజీవి - శ్రీదేవి జంటగా నటించిన ‘జగదేక వీరుడు - అతిలోక సుందరి’కీ దీనికీ పోలికలున్నాయనీ ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి.

అయితే, ఆ వార్తల్లో నిజం లేదనీ, ఈ చిత్రకథ వినోదాత్మకంగా సాగుతుందనీ చిత్ర యూనిట్ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. కథాంశం ఏమైనప్పటికీ, అటు నాగార్జున బృందం, ఇటు నితిన్ బృందం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని రూపొందిస్తున్న ఈ చిత్రం ద్వారా హీరోగా అఖిల్ ఎంట్రీ భారీగా ఉంటుందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదేమో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement