
న్యూఢిల్లీ : మనకాలపు అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణం యావత్ భారతీయ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంత పరిచింది. దుబాయ్‌లో జరుగుతున్న ఓ కుటుంబ వేడుకలో పాల్గొన్న ఆమె తీవ్ర గుండెపోటు రావడంతో అకస్మాత్తుగా కుప్పకూలారు. యావత్ అభిమానుల్ని శోకసంద్రంలో ముంచుతూ ఆమె దివ్యలోకాలకు ఏగారు.
ఆమె హఠాన్మరణం.. ఒకప్పటి ప్రముఖ నటి దివ్యభారతిని గుర్తుకుతెస్తోంది. రూపురేఖల విషయంలో శ్రీదేవితో దగ్గరి పోలికలు ఉన్న దివ్యభారతి 19 ఏళ్ల వయస్సులో అనుమానాస్పద పరిస్థితుల నడుమ కన్నుమూశారు. ఆమె మరణం ఒక మిస్టరీగా మారింది. నిజానికి 90వ దశకంలో శ్రీదేవి వెండితెరపై వెలిగిపోతున్న సమయంలోనే దివ్యభారతి చిత్రసీమలోకి ఆరంగేట్రం చేశారు. అప్పట్లో అందరూ దివ్యభారతిని శ్రీదేవి చెల్లెలు అంటూ పిలిచేవారు.
ఒకానొక దశలో శ్రీదేవి స్థానాన్ని దివ్యభారతి తన నటనతో, అందంతో భర్తీ చేస్తుందని భావించారు. కానీ, ఆమె అకాల మృతి చిత్ర పరిశ్రమను నివ్వెరపోయేలా చేసింది. షాకింగ్ విషయమేమిటంటే దివ్యభారతి పుట్టినరోజు తేదీకి సమీపంలోనే శ్రీదేవి కన్నుమూయడం. 1974 ఫిబ్రవరి 25న దివ్యభారతి జన్మించింది. దివ్యభారతి పుట్టినతేదీకి ఒక రోజు ముందు దుబాయ్‌లో శ్రీదేవి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
90వ దశకంలో దివ్యభారతి వరుస సినిమాలతో బాలీవుడ్‌లో ప్రభంజనం సృష్టించింది. కొన్ని నెలల వ్యవధిలోనే ఆమె వరుస సినిమాలు బాలీవుడ్‌ను ముంచెత్తాయి. అనతికాలంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కేవలం మూడేళ్ల బాలీవుడ్ కెరీర్‌లో దివ్యభారతి 13 సినిమాలు చేసింది. అన్ని దాదాపు భారీ బడ్జెట్ సినిమాలే. కానీ, 1993లో ఏప్రిల్ 5న దివ్యభారతి మద్యంమత్తులో (?) తన బాల్కనీ నుంచి దురదృష్టవశాత్తు పడిపోయి ప్రాణాలు విడిచింది. ఆమె మిస్టిరీయస్ మృతితో ఆమె ఒప్పుకొని సంతకం చేసిన పలు సినిమాల పరిస్థితి సందిగ్ధంలో పడింది. అంతకుముందే దివ్యభారతి ‘లాడ్లా’ సినిమాలో చాలావరకు నటించింది. అయితే, ఆమె చనిపోవడంతో ఆమె స్థానంలో శ్రీదేవిని లీడ్‌రోల్‌లోకి తీసుకున్నారు. అనిల్ కపూర్, శ్రీదేవి, రవీనా టాండన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘లాడ్లా’ బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఆ సమయంలో శ్రీదేవి, దివ్యభారతి ఒకరికొకరు ప్రత్యామ్నాయం అని బాలీవుడ్ దర్శక నిర్మాతలు భావించేవారు.
Comments
Please login to add a commentAdd a comment