‘‘ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది. కంటెంట్ అండ్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలవైపే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. కానీ పెద్ద హీరోలు చేసిన కాన్సెప్ట్ సినిమాలు మాత్రమే ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరుతున్నాయి. ‘రంగస్థలం’ అందుకు ఓ ఉదాహరణ. మధ్య స్థాయి హీరోలు చేసిన కాన్సెప్ట్ సినిమాలు మల్టీఫ్లెక్స్‌లకే పరిమితం కాకూడదు. అందుకే స్క్రిప్ట్‌లో ఏయే అంశాలు కావాలో వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది’’ అని శ్రీవిష్ణు అన్నారు. విజయ్‌కృష్ణ. ఎల్ దర్శకత్వంలో శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘తిప్పరామీసం’. రిజ్వాన్ నిర్మించిన ఈ చిత్రం గ్లోబల్ సినిమాస్ ద్వారా రేపు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు చెప్పిన విశేషాలు.
► ‘తిప్పరామీసం’ సినిమాలో నేను నైట్ క్లబ్‌లో పని చేసే డీజే పాత్ర చేశాను. క్యారెక్టర్‌లో నెగటీవ్ షేడ్స్ ఉంటాయి. కాస్త రఫ్‌గా కనిపిస్తాను. ఈ సినిమా కోసం నేను బరువు పెరిగాను. ఫుల్‌గా మాస్ క్యారెక్టర్ కాదు. కానీ మాస్ అప్పీల్ ఉంటుంది. చాలా నిర్లక్ష్యంగా ఉండే క్యారెక్టర్. తినడం.. తాగడం.. పడుకోవడం. అలాంటి అతని జీవితం కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఎలా ప్రభావితం అయ్యిందన్నదే కథ. తెలుగు ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని మూడు సీక్వెన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. అవి ప్రేక్షకులకు నచ్చుతాయని ఆశిస్తున్నాం.
► సినిమాలో అమ్మ సెంటిమెంట్ ఉంటుంది. అమ్మ కోసం హీరో ఏ పని చేసి గర్వంగా ఫీల్ అయ్యాడో, ఏ పరిస్థితుల్లో మీసం తిప్పాడో వెండితెరపై చూసినప్పుడు ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటుంది. తల్లి పాత్రలో రోహిణిగారు అద్భుతంగా నటించారు. దర్శకుడు విజయ్ సినిమాను బాగా తీశాడు.
► విజయ్ అసోసియేషన్‌లో ఎక్కువ సినిమాలు చేయడానికి ప్రత్యేకమైన కారణం లేదు. నేను, నారా రోహిత్, విజయ్ భాగస్వాములం. నాతో పని చేసిన ఎవరైనా నాతో మళ్లీ వెంటనే సినిమా చేస్తామంటారు. కానీ నాకు ఉన్న ఇతర కమిట్‌మెంట్స్ గురించి కూడా ఆలోచించాలి. నాతో వర్క్ చేయడం కంఫర్ట్‌గా ఉంటుందని దర్శకుడు విజయ్ కృష్ణ చెప్పారంటే సంతోషంగా ఉంది. నేను ఎవరితో సినిమా చేసినా సమయానికి వెళతాను.. దర్శకులు చెప్పింది చేస్తాను.
► ‘బ్రోచెవారెవరురా’ సినిమా నన్ను మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేసింది. ఈ సినిమాలో క్రేజీ కామెడీ ఉంది. కానీ కామెడీ మాత్రమే ప్రేక్షకులకు చాలదు. కథలో కంటెంట్ కూడా బాగుండాలి. ‘బ్రోచేవారెవరురా’ తర్వాత వస్తున్న నా చిత్రాలపై అంచనాలు ఉండొచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత బాధ్యతగా సినిమాలు చేస్తున్నాను.
► నా కెరీర్ మొదట్లో నా దగ్గరకు కమర్షియల్ కథలు వచ్చేవి. కానీ ఇప్పుడు భిన్నమైన కథలే వస్తున్నాయి. నేను కూడా రెగ్యులర్ సినిమాలు చేయాలనుకోవడం లేదు. కానీ పెద్ద హీరోలు చేసే కమర్షియల్ సినిమాలు చూస్తాను. ఎంజాయ్ చేస్తాను. అయితే నేను కాన్సెప్ట్ సినిమాలు చేస్తాను. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు వస్తే చేయడానికి సిద్ధమే. కథ నచ్చాలి.
► ఇప్పటికే మూడు సినిమాలు కమిట్ అయ్యాను. ఈ సినిమాల చిత్రీకరణ పూర్తయ్యాక పారితోషికం పెంపుదల గురించి ఆలోచిస్తాను. నారా రోహిత్‌తో కలిసి నేను నటించాల్సిన ఓ పీరియాడికల్ మూవీ కోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. బహుశా వచ్చే ఏడాది మొదలుకావొచ్చు.
సమయానికి వస్తాను... చెప్పింది చేస్తాను
Published Thu, Nov 7 2019 12:33 AM | Last Updated on Thu, Nov 7 2019 10:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment