ఈ ఏడాది డెరైక్షన్ చేస్తాను
ఈ ఏడాది డెరైక్షన్ చేస్తాను
Published Thu, Jan 2 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM
‘‘ఎప్పటి నుంచో దర్శకత్వం చేయాలనుకుంటున్నా. ఆ ఆలోచన ఈ ఏడాది కచ్చితంగా కార్యరూపం దాలుస్తుంది. ఓ పెద్ద హీరోతో పెద్ద స్థాయిలోనే ఉంటుంది’’ అని రచయిత చిన్ని కృష్ణ తెలిపారు. నరసింహనాయుడు, నరసింహ, ఇంద్ర, గంగోత్రి, బద్రినాథ్, జీనియస్‌లాంటి చిత్రాలకు రచన చేసిన చిన్ని కృష్ణకు నేడు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తన భవిష్యత్తు ప్రణాళికలను, లక్ష్యాలను వివరించారు. ‘‘చిరంజీవి గారి 150వ చిత్రం కోసం అద్భుతమైన కథ సిద్ధం చేస్తున్నాను.
అలాగే ఆమిర్‌ఖాన్ కోసం నాలుగేళ్లుగా ఓ మంచి స్క్రిప్టు సిద్ధం చేస్తున్నాను. ఇందుకోసం ముంబై కూడా వెళ్లి వస్తున్నా. ప్రస్తుతం నా దగ్గర పది స్క్రిప్టులు సిద్ధంగా ఉన్నాయి. అందులో అయిదు స్క్రిప్టులు నేనే డెరైక్ట్ చేసుకుంటాను. మిగిలినవి బయటి దర్శకులకు ఇస్తాను. సూర్య, పవన్‌కల్యాణ్, మహేశ్, ఎన్టీఆర్, బన్నీలాంటి యంగ్ హీరోల సినిమాలు డెరైక్ట్ చేయాలని ఉంది’’ అని చెప్పారు చిన్ని కృష్ణ. పన్నెండేళ్ల కెరీర్‌లో చాలా తక్కువ చిత్రాలకే రచన చేయడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తే -‘‘నేను కొంతమందికే అర్థం అవుతాను.
అందుకే అందరూ నాతో కనెక్ట్ కాలేరు. అలా కనెక్ట్ అయిన వాళ్లతోనే నేను పని చేయగలుగుతాను. అందుకే తక్కువ సినిమాలు చేశా’’ అని జవాబిచ్చారాయన. చార్లీ చాప్లిన్, రాజ్‌కపూర్, భాగ్యరాజా, సుజాత తన అభిమాన రచయితలని చిన్ని కృష్ణ పేర్కొన్నారు. ‘‘రచయితగా, దర్శకునిగా నాపై మణిరత్నం, శంకర్ ప్రభావం ఎక్కువగా ఉంది. రేపు నేను డెరైక్ట్ చేయబోయే సినిమా వాళ్లిద్దరికీ చూపించి వాళ్లతో చాలా బావుందనిపించుకునే స్థాయిలో వర్క్ చేస్తాను’’ అని చిన్ని కృష్ణ తెలిపారు.
Advertisement
Advertisement