కామన్‌మెన్ గుండె చప్పుడు ఆగిపోయింది... తెలుగమ్మాయి స్కూల్ పుస్తకంలోకొచ్చిన
మొదటి హీరో ఫొటో కనపడకుండా పోయింది... సినిమా థియేటర్‌కి కట్టిన మొట్టమొదటి హీరో
బ్యానర్ గాలికి ఎగిరిపోయింది... తన కోసం క్యూలో జనానికి తొక్కిసలాట అలవాటు చేసిన
తొలి తెలుగు సినిమా టికెట్... 91 ఏళ్ల తర్వాత ఇప్పుడు చినిగిపోయింది... తెలుగు హీరో అడ్రస్‌కి
పోస్ట్‌మేన్ తెచ్చిన తొలి ప్రేమలేఖ... ఊరి గోడలు దాటి నట్టింటికొచ్చిన మొదటి సినిమా పోస్టర్...
సెలూన్ గోడలమీద సినిమా హీరోలకు చోటిచ్చిన స్టయిలిష్ హీరో స్టిల్ ఫొటో... ఇప్పటికీ ఊళ్లో వైన్ షాప్ బోర్డ్ మీద
గ్లాస్ పట్టుకొని కనిపించే దేవదాసు బొమ్మ... భౌతికంగా ఇక లేదు.
వెండితెర చిన్నబోయిన వేళ అది... సినిమా తల్లి గర్భశోకంతో వెక్కి వెక్కి ఏడ్చిన వేళ అది. తెలుగునేల జనసంద్రంగా మారిన వేళ అది. 75 ఏళ్ల పాటు అసమాన నటనతో తెలుగుతెరను స్వర్ణయుగశోభితం చేసిన అద్వితీయ నటుడు అక్కినేని.. భౌతికంగా ఇక కనబడరని తెలిసి కోట్లాది జనం గుండెలవిసేలా తల్లడిల్లిన వేళ అది.
ప్రేమలోని మాధుర్యాన్ని వెండితెర సాక్షిగా తెలియజేసిన అందాల ‘బాలరాజు’ ఇక లేడా?
‘కలిమిలేములు కష్టసుఖాలు.. కావడిలో కుండలని భయమేలోయీ..’ అని ధైర్యం చెప్పిన ‘దేవదాసు’ ఇక రాడా?
విరహాన్నీ, విషాదాన్నీ, హాస్యాన్ని, ఆగ్రహాన్నీ అన్ని రసాలనీ అనితరసాధ్యంగా అభినయించి దశాబ్దాల పాటు ఆనందాన్ని పంచిన అభినయ శిఖరం భౌతికంగా ఇక కనిపించదా?
నిన్నటిరోజు తెలుగు ప్రజానీకం గుండెల్లో ప్రతిధ్వనించిన ప్రశ్నలివి.
విషణ్ణ వదనాలతో అక్కినేని భౌతికకాయాన్ని అనుసరించినవారు లక్షలాదిగా ఉంటే...
కోట్లాది మంది జనాలు టీవీ సెట్‌లకు అతుక్కుపోయారు. కన్నీటితోనే ఆ మహా నటుడికి తుది వీడ్కోలు పలికారు.
గురువారం ఉదయం 11.30 నిమిషాల నుంచి సాయంత్రం 3 గంటల వరకూ జరిగిన అక్కినేని అంతిమయాత్రలో... సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు లక్షలాదిగా అభిమానులు పాల్గొన్నారు. అగ్నిసంస్కారం జరిగే వరకూ ఆ బహుదూరపు బాటసారికి తోడుగా నిలిచారు. కుటుంబ సభ్యులతో పాటు, సినీ ప్రముఖులు సైతం కన్నీటి పర్యంతమైన ఆ ఘట్టం... మాటలతో వర్ణించరానిదే. అగ్నిలో పునీతుడవుతున్న అక్కినేనిని చూసి, అశేష తెలుగు జనం అశ్రు నివాళి అర్పించిన వేళ అది.