ఆమిర్ ఖాన్ (ఫైల్ ఫోటో)
సాక్షి, ఢిల్లీ: ‘కాలం మారింది. ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పు వచ్చింది. నేడు వైవిధ్యమైన, వినూత్నమైన కథలను అభిమానులు ఆదరిసున్నార’ని బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ అన్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత 30 ఏళ్లలో భారతీయ సినీ అభిమానుల ఆసక్తుల్లో వచ్చిన మార్పులపై ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్పోర్ట్స్ డ్రామాగా 1992లో తెరకెక్కిన ‘జో జీతా హై వొహీ సికందర్’ నేటి కాలానికి కూడా సరిపోయే గొప్ప సినిమా. ఆ తరహా కథలతో వచ్చే సినిమాలకు నేడు మంచి ఆదరణ ఉంది. కథలో వైవిధ్యం ఉన్న సినిమాలు బాక్సాఫీసు దగ్గర మంచి విజయాలు సాధిస్తున్నాయ’ని ఆమిర్ అన్నారు.
‘కేవలం కథను నమ్మి సినిమా చేయడం కత్తి మీత సామే. నా వరకైతే అది కమర్షియల్ సినిమానా, కథ ప్రధానంగా రూపొందే సినిమానా అని చూసుకోను. మంచి కథతో సినిమా చేయాలి. సినిమాను ఎక్కువ మంది ఇష్టపడాలి’ అని మాత్రామే ఆలోచిస్తానని ఆమిర్ వివరించారు. ‘కానీ, ఈ రోజుల్లో ఫలానా మూవీ మంచి సినిమా అని చెప్పడం కష్టం. ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాను గొప్ప సినిమాగా లెక్కేస్తున్నామ’ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా కథ గురించి సగటు ప్రేక్షకుడిగా ఆలోచిస్తాని అన్నారు. వాణిజ్య పరంగా సినిమా నిలదొక్కుకోవడానికి కొన్ని మెళకువలు కూడా పాటిస్తానన్నారు.
సినీ రంగంలో చాలా మంది హీరోలు ప్రయోగాలకు దూరంగా ఉన్నారు. కొందరు మాత్రమే కథను నమ్మి సినిమాలు చేస్తున్నారని ఆమీర్ అభిప్రాయ పడ్డారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి వారు అటు వాణిజ్య విలువలు, ఇటు విభిన్న కథాంశాలను మిళితం చేస్తూ పలు సినిమాలు చేశారు. స్వదేశ్, రాయీస్, భజరంగీ భాయ్‌జాన్ వంటి సినిమాలు ఆ కోవకు చెందినవేనని ఆయన అన్నారు. కథ ప్రధానంగా తెరకెక్కిన తారే జమీన్ పర్, రంగ్ దే బసంతి, దిల్ చాహ్‌తా హై వంటి సినిమాలు ప్రేక్షకులను అలరించినా.. వసూళ్లు సాధించలేదని అన్నారు.
‘నా కెరీర్‌లో తొలి కమర్షియల్ హిట్ ‘ఖయామత్ సే ఖయామత్ తక్’. అప్పటికీ నాకు సొంత కారు కూడా లేదు. ప్రయాణం బస్సుల్లోనే సాగేద’ని ఆమిర్ గుర్తు చేసుకున్నారు. నెలకు వెయ్యి రూపాయల సంపాదనతో కెరీర్ ప్రారంభించాననీ.. ఖయామత్ సే ఖయామత్ తక్ చిత్రానికి తన సంపాదన పదకొండు వేలు మాత్రమేనని ఆయన తెలిపారు.
ఎప్పుడూ వైవిధ్యం కోసం ఆరాటపడే ఆమిర్ ఖాన్ నటించిన గజిని సినిమా 2008లో విడుదలై ఘనవిజయం సాధించింది. రూ.100 కోట్ల వసూళ్లు సాధించి భారతీయ సినిమా రంగంలో వసూళ్ల పరంగా ‘వంద కోట్ల సినిమా క్లబ్’కు నాంది పలికింది.
Comments
Please login to add a commentAdd a comment