
చరణ్‌కి ఎముకలు లేవేమో అనిపించింది!
నేటి తరం కథానాయిక ఎలా ఉండాలో రకుల్ ప్రీత్‌సింగ్ అచ్చంగా అలానే ఉంటారు. మెరుపుతీగకు చిరునామానేమో అన్నంత స్లిమ్‌గా ఉంటారు రకుల్. అందంతో పాటు అభినయంలో కూడా బెస్ట్ అనిపించుకోవడంతో ఇప్పుడు రకుల్ తెలుగు పరిశ్రమలో ‘మోస్ట్ వాంటెడ్ హీరోయిన్’ అయ్యారు. ఈ నెల 16న విడుదల కానున్న ‘బ్రూస్‌లీ ది ఫైటర్’లో ఆమె కథానాయికగా నటించారు. నేడు రకుల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘బ్రూస్‌లీ ది ఫైటర్’ విశేషాలతో పాటు ఇతర విశేషాలను ఈ విధంగా పంచుకున్నారు.
‘బ్రూస్‌లీ ది ఫైటర్’లో నా పాత్ర పేరు రియా. వీడియో గేమ్స్ డిజైనర్‌ని అన్నమాట. స్టంట్ మాస్టర్ అయిన హీరో రాంచరణ్ కోసం ఓ వీడియో గేమ్ డిజైన్ చేసే పని మీద ఉంటాను. ఈ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. దానికి కారణం ఏంటంటే, రియా మనసుకి ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తుంది. వెనకా ముందూ ఆలోచించదు. అది కామెడీగా ఉంటుంది.
ప్రేక్షకులను ఈ పాత్ర నవ్విస్తుంది. ఈ చిత్రంలో నేను చాలా అందంగా, స్టయిలిష్‌గా ఉంటాను. ఆ క్రెడిట్ దర్శకుడు శ్రీను వైట్లగారికే దక్కుతుంది. ఆయన విజువలైజేషన్ సూపర్. క్లారిటీ ఉన్న డెరైక్టర్. అలాగే నిర్మాత దానయ్యగారు రాజీపడకుండా నిర్మించారు. సినిమా చాలా గ్రాండ్‌గా ఉంటుంది.
భయం వేసింది : రాంచరణ్ మంచి డ్యాన్సర్. నాకైతే తనతో డ్యాన్స్ చేయాలంటే భయం వేసింది. రిహార్శల్ చేయకుండానే చేసేస్తాడు. చరణ్ డ్యాన్స్ చూసినప్పుడు తన బాడీలో బోన్స్ లేవేమో అనిపించింది (నవ్వుతూ). అంతర్జాతీయ స్థాయిలో పాటలు ఉండాలనే పట్టుదలతో రాత్రింబవళ్లు వర్క్ చేశాం. చరణ్ చాలా నైస్ పర్సన్. స్టార్ హీరో అనే ఫీలింగ్ ఏమాత్రం లేకుండా అందరితో సరదాగా ఉంటారు.
చిరంజీవిగారు మెచ్చుకున్నారు : ఈ చిత్రం నాకు బోల్డన్ని తీపి గుర్తులు మిగిల్చింది. ‘లే చలో సాంగ్..’ పాటలో బాగా డ్యాన్స్ చేశావనీ, అందంగా కూడా ఉన్నావని చిరంజీవిగారు నన్ను మెచ్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. ఎంతో అంకితభావం ఉన్న నటుడాయన. చిరంజీవిగారితో కలిసి నటించే అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. డెరైక్టరే షాట్ ఓకే అన్నా, ఇంకోసారి చేస్తాననేవారు.
షారుక్ సర్‌ప్రైజ్ చేశారు : ఈ చిత్రం సమయంలో మిగిలిన మరో తీపి గుర్తు షారుక్ ఖాన్ మా సెట్‌కి రావడం. ఒకరోజు రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో పాట చిత్రీకరణ జరుగుతోంది. హఠాత్తుగా యూనిట్ సభ్యులందరూ బయటకు వెళ్లిపోయారు. నేనూ, చరణ్ మాత్రమే మిగిలాం. కట్ చేస్తే.. షారుక్ ఖాన్ ఎంటర్ అయ్యి, మాకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. మానిటర్‌లో చరణ్ స్టెప్స్ చూసి, షారుక్ బాగా ఎంజాయ్ చేశారు. ఏమాత్రం రిహార్శల్ చేయకపోయినా బాగా డ్యాన్స్ చేశావని చరణ్‌ని అభినందించారు. ఫైట్ సీక్వెన్స్ చూసి కూడా షారుక్ థ్రిల్ అయ్యారు.
‘బ్రహ్మత్సవం’ మిస్ అయినందుకు బాధగా ఉంది: పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్ ఇలా టాలీవుడ్‌లో నాకు నచ్చిన హీరోలు చాలామంది ఉన్నారు. మహేశ్‌బాబుతో ‘బ్రహ్మోత్సవం’లో నటించే అవకాశం వచ్చినా. డేట్స్ ఖాళీ లేక వదులుకోవాల్సి వచ్చింది. చాలా బాధపడ్డాను. నాకింకా బోల్డంత కెరీర్ ఉంది. మరో అవకాశం వస్తుందనే నమ్మకం ఉంది. పారితోషికం పెంచారట? అని చాలామంది నన్ను అడుగుతుంటారు. సినిమా సినిమాకీ నా పాపులార్టీ పెరుగుతోంది. అలాంటప్పుడు నా మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని పారితోషికం తీసుకుంటే తప్పు లేదనుకుంటున్నా.
నాకు నేనే పోటీ! : ప్రస్తుతం చాలామంది కథానాయికలు ఉన్నారు. అందరూ టాలెంటెడే. నేనెవర్నీ పోటీగా భావించను. నాకు నేనే పోటీ అనుకుంటా. నంబర్ గేమ్‌ని నమ్మను. కెరీర్ ఆరంభించిన కొంత కాలానికే పెద్ద సినిమాల్లో నటిచండం ఆనందంగా ఉంది. ఫామ్‌లో ఉన్న ప్రతి కథానాయికతో పోటీపడితే మానసిక ప్రశాంతత కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే నా పని మీద పూర్తిగా ఫోకస్ పెడతా. ఫలితం దేవుడు ఇస్తాడని నమ్ముతాను.