
టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (పాత ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న నటులు, మహిళలను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడిన ఓ తెలుగు టీవీ ఛానెల్ అనుసంధానకర్త సాంబశివరావుపై నటి మంచు లక్ష్మీ మండిపడ్డారు. సదరు చానెల్‌లో ప్రసారమైన వీడియో క్లిప్పింగ్‌తో సహా ట్వీట్ చేసిన ఆమె.. సినీ పరిశ్రమలో మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ విషయాన్ని టాలీవుడ్ అంతసులువుగా వదలదని తేల్చిచెప్పారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తూ పబ్లిసిటీ తెచ్చుకుందామని ప్రయత్నించడం కంటే నీచమైన పని మరొకటి లేదన్నారు. జర్నలిస్టు వృత్తిలో ఉన్న వారు బాధ్యతతో మెలగాలని హితవు పలికారు.
మంచు లక్ష్మీ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన టాలీవుడ్ నటి లావణ్య త్రిపాఠి.. మహిళలను ఉద్దేశించి తప్పుగా మాట్లాడుతున్న వీడియోలు ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ అయ్యాయని అన్నారు. ఒక్కొక్కరు ఒక్కోరకంగా మహిళలను అవమానిస్తున్నారని.. శనివారం టీవీ చానెల్ డిబేట్‌లో ఓ ప్రత్యేక మార్గాన్ని ఎన్నుకుని మరీ అసభ్యంగా మాట్లాడారని అన్నారు.
కాగా, శనివారం రాత్రే టాలీవుడ్ ప్రతినిధులు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో సాంబశివరావుపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదు చేసిన వారిలో టాలీవుడ్ నటీనటులు ఝాన్సీ, హేమ, శివాజీ రాజా, బెనర్జీ, ఉత్తేజ్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment