
నీటిలో ఆరు నిమిషాలు...
అది టామ్ క్రూజ్ నటిస్తున్న ‘మిషన్ ఇంపాజిబుల్’ షూటింగ్ లొకేషన్. దర్శకుడు యాక్షన్ అని చెప్పగానే టామ్ నీళ్లల్లోకి దూకేశారు. సమయం గడుస్తోంది. చిత్ర బృందం అంతా చాలా టెన్షన్‌గా ఉంది. ఒకటి...రెండు...ఇలా ఆరో నిమిషం కాగానే దర్శకుడు క్రిస్టోఫర్ మెక్వైర్ ‘కట్’ చెప్పగానే టామ్ బయటకు వచ్చేశారు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? ఆరు నిమిషాల నిడివి ఉన్న ఈ షాట్‌ను కేవలం సింగిల్ టేక్‌లో తీశారు. మామూలుగా ఎవరైనా కేవలం నీటి అడుగున 22 సెకన్ల పాటు ఊపిరి బిగబట్టి ఉంటారన్నది సైన్స్.
కానీ టామ్ మాత్రం ఆరు నిమిషాల పాటు ఉండి, చిత్ర బృందాన్ని ఆశ్చర్యపరిచారు. ‘మిషన్ ఇంపాజిబుల్’ ఫ్రాంచైస్‌లో ఇప్పటిదాకా ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాల్లో నటించిన టామ్... దర్శకుడు క్రిస్టోఫర్ ఈ సన్నివేశం గురించి చెప్పగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎటువంటి ఆధారం లేకుండా విమానం మీద టామ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు ఇప్పటికే యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. మరి.. ఈ సినిమాలో ఇంకెన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలియాలంటే జూలై 31 వరకూ ఆగాల్సిందే.