వాసు ఇంద్రజాలికుడు మాత్రమే కాదు... పైలట్ కూడా. ఎటువంటి ప్రమాదం నుంచైనా తప్పించుకోగల సత్తా ఉన్నవాడు. అలాంటి వాడు ఓ పెనుముప్పును తప్పించడానికి ఒక టీమ్‌తో అంతరిక్షంలోకి వెళ్తాడు. కానీ, అక్కడి పరిస్థితులు చేయిదాటి పోతాయి. కాలానికి వ్యతిరేకంగా పరిగెత్తాల్సి వస్తుంది. ‘రేస్ ఎగైనస్ట్ టైమ్’ అన్నమాట. అప్పుడు వాసు ఏం చేశాడు? ఈ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడా? టీమ్‌లో ఉన్న అందరూ క్షేమమేనా? అన్న ఆసక్తికర అంశాలను తెలుసుకోవాలంటే మా సినిమా చూడాలంటున్నారు తమిళ దర్శకుడు శక్తీ సుందర్ రాజన్.
‘జయం’ రవి, నివేతా పేతురాజ్, అరోన్ అజీజ్ ముఖ్య పాత్రలుగా శక్తీ సుందర్ రాజన్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘టిక్. టిక్. టిక్’. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ‘ఫస్ట్ ఇండియన్ స్పేస్ మూవీ ఇదే’ అని కూడా అన్నారు. ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారని కోలీవుడ్ సమాచారం. కమర్షియల్ సినిమాలకు భిన్నంగా చిత్రాలను రూపొందిస్తుంటారు శక్తీ సుందర్. గత ఏడాది ‘జయం’ రవితో ఆయన తీసిన ‘ మిరుదన్’ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ‘టిక్. టిక్. టిక్’పై అంచనాలు పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment