
ఈ కథ చెప్పడం నా ధర్మం
‘‘మహాకవి దాశరథి ‘ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాలనమెంతో.. ఆ నల్లని ఆకాశంలో కనరాని భాస్కరులెందరో’ అన్నారు. అలాగే, ప్రపంచపటంలో మన దేశానికి ఓ గౌరవాన్ని ఇచ్చిన, పురిటినొప్పుల ఈ పుడమిగర్భంలో కానరాని ఒక భాస్కరుని వీరగాధ ఈ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఓ తెలుగు బిడ్డగా, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు జెండాని ఎగురవేసిన నందమూరి తారకరామారావు వారసుడిగా ఈ కథను చెప్పడం నా ధర్మంగా భావించాను’’ అన్నారు బాలకృష్ణ. ఆయన హీరోగా క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మించిన సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. శుక్రవారం కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలలో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాత, ఈ సినిమా నైజాం డిస్ట్రిబ్యూటర్ సుధాకర్‌రెడ్డి విడుదల చేశారు.
బాలకృష్ణ మాట్లాడుతూ – ‘‘వందో సినిమా ఏది చేయాలా? అని చాలా కథలు విన్నా. కొన్ని నచ్చలేదు. మరికొన్ని నేను అనుకున్న స్థాయికి రాలేదని సతమతమవుతున్న సమయంలో క్రిష్ ఈ కథ చెప్పారు. ప్రతి రెండు సినిమాల మధ్య వ్యత్యాసం చూపించాలని, కొత్తదనం అందించాలని ఉవ్విళ్లూరే వ్యక్తి క్రిష్. అంతకు ముందు మాకు పరిచయం లేదు. యాదృచ్ఛికమో... కాకతాళీయమో... ఆ దేవుడే మమ్మల్ని కలిపాడు. దురదృష్టం ఏంటంటే... శాతకర్ణి చరిత్ర మన దగ్గర తక్కువ ఉంది. వాళ్ల అమ్మగారు గౌతమి శాసనాలపై చెక్కించారు. అవి కాశీలో ఉన్నాయి. ఈ పాత్ర లభించడం నా పూర్వజన్మ సుకృతం. నేనూ ట్రైలర్‌ను చూడడం ఇదే మొదటిసారి. అభిమానం అనేది డబ్బుతో కొనేది కాదు. ఎటువంటి ప్రలోభాలకు లొంగేది కాదు. ఇంతకాలం నా నుంచి ఏమీ ఆశించకుండా మీరు చూపిస్తున్న అభిమానమే నాకు శ్రీరామరక్ష. అటువంటి అభిమానుల మధ్యలో ట్రైలర్ చూడాలనుకున్నా’’ అన్నారు. దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ – ‘‘వందో చిత్రాన్ని మా యూనిట్ చేతిలో బాలకృష్ణగారు ఎందుకు పెట్టారో ఈ ట్రైలర్ మీకు (ప్రేక్షకులకు) చూపించిందని ఆశిస్తున్నా’’ అన్నారు.
మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ – ‘‘నేను మాటలు రాస్తున్నది ఓ సినిమాకి కాదు, ఒకేసారి వంద సినిమాలకు... అని ప్రతిక్షణం మనసులో అనుకునేవాణ్ణి. నేను ఎన్టీఆర్ భక్తుణ్ణి. ఆయనకు రాసే అవకాశం రాదు. నేను రాసిన డైలాగులు బాలకృష్ణగారు చెప్తుంటే నాకు రామారావుగారు గుర్తొచ్చారు’’ అన్నారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.