గీతాంజలి మిస్సయ్యాను...త్రిపురకు సెట్ అయ్యాను!
‘‘నా కెరీర్‌లో నేను చేసిన తొలి హారర్ చిత్రం ‘త్రిపుర’. హారర్ చిత్రాలు చూస్తున్నప్పుడు నాకు భయం వేస్తుంది. అయితే, ఈ చిత్రంలో నటించేటప్పుడు భయపడలేదు’’ అని స్వాతి అన్నారు. అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్ స్వాతి. చాలా తక్కువ సమయంలోనే పేరు తెచ్చుకున్నారామె. తమిళంలో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ పదహారణాల తెలుగమ్మాయి రేపు ‘త్రిపుర’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ నిర్మించిన ఈ చిత్రానికి రాజకిరణ్ దర్శకుడు. ఇక.. స్వాతి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
‘త్రిపుర’ చిత్రంలో నేను దాదాపు చీరల్లోనే కనిపిస్తాను. ‘గోల్కొండ హై స్కూల్’లో నన్ను చీరల్లో చూసి, మరీ చిన్నపిల్లలా ఉన్నావన్నారు. అందుకే త్రిపుర పాత్ర కోసం బరువు పెరిగాను. నిజజీవితంలో ఓ గృహిణి ఎలా ఉంటుందో ఈ చిత్రంలో అలా కనిపిస్తాను. ఇంతకుముందు ఈ చిత్రదర్శకుడు రాజకిరణ్ దర్శకత్వం వహించిన ‘గీతాంజలి’కి నన్నడిగారు. అప్పుడు డేట్స్ ఖాళీ లేక చేయలేకపోయాను. ఈ చిత్రం చేస్తున్నప్పుడు రాజకిరణ్ చెప్పిన పలు విషయాలు నన్ను ఆసక్తికి గురి చేశాయి. ఓ దెయ్యంతో ఆయన మూడు నెలలు సావాసం చేశారట. సినిమా అంటే ఆయనకు ఎంతో ప్యాషన్ ఉంది. ‘త్రిపుర’ను చాలా బాగా తీశారు.
ఈ సినిమాలో త్రిపురకు వచ్చే కలలు నిజమవుతుంటాయి. భర్తతో హాయిగా సంసారం సాగిస్తున్న సమయంలో త్రిపురకు వచ్చిన ఒక కల వాళ్ల జీవితాన్ని ఎలా మార్చేసింది? అనేది కథ. నేను దెయ్యాలను, సూపర్ న్యాచురల్ పవర్స్‌నీ నమ్మను. విధినీ, కర్మనూ నమ్ముతాను. ఇది దెయ్యం సినిమా కాదు. థ్రిల్లర్ మూవీ. నవ్విస్తూ, థ్రిల్‌కి గురి చేస్తుంది. సినిమా చేసేటప్పుడు నేనూ థ్రిల్ అయ్యాను. ముఖ్యంగా పెళ్లి సీన్‌లో. నిజంగా పెళ్లి జరుగుతుందేమో అనే ఫీలింగ్ కలిగింది.
తెలుగు సినిమాలు ఎందుకు చేయడంలేదు? అనే ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. దర్శక, నిర్మాతలనే అడగాలి. షూటింగ్స్ లేనప్పుడు మా అమ్మా నాన్నలతో స్పెండ్ చేస్తాను. నాక్కాబోయే భర్త ఎలా ఉండాలో వాళ్లతో చెబుతుంటాను. నన్ను బాగా అర్థం చేసుకోగలడు అనే నమ్మకం కుదిరిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను. పెళ్లి తర్వాత సినిమాలు చేయాలా? మానేయాలా? అనేది నిర్ణయించుకోలేదు. పెళ్లి తర్వాత హాయిగా నా ఇంటిని చక్కబెట్టుకోవాలని అనుకుంటున్నాను.