తమిళసినిమా: దివంగత ముఖ్యమంతి జయలలిత జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కే చిత్రంలో ఆమె పాత్రలో నటించడానికి రెడీ అంటోంది నటి త్రిష. ఈ బ్యూటీ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన మోహిని చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. ఈ చిత్రం త్రిష కేరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదనే విమర్శలను ఎదుర్కొంటోంది. ఈమె నటిస్తున్న గర్జన, 96, చతురంగవేట్టై–2 చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఈ విషయాలు అటుంచితే ఇటీవల బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోందని చెప్పవచ్చు. ది డర్టీ పిక్చర్ పేరుతో తెరకెక్కిన సిల్క్‌స్మిత బయోపిక్‌లో నటి విద్యాబాలన్ నటించి ఏకంగా జాతీయ అవార్డునే అందుకుంది. అదేవిధంగా క్రికెట్ క్రీడాకారుడు మహేంద్రసింగ్ ధోని బయోపిక్‌తో తెరకెక్కిన ఎంఎస్.ధోని చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. బాలీవుడ్ నటుడు సంజ య్‌దత్ జీవిత చరిత్ర సంజు పేరుతో తెరకెక్కి భారీ విజయాన్నే అందుకుం ది. మరో శృంగార నటి షకీలా జీవిత చరిత్ర తెరకెక్కుతోంది.
ఇక మహా నేత రాజశేఖరరెడ్డి జీవిత చరిత్రతో భారీ చిత్రం నిర్మాణంలో ఉంది. ఇందులో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటించడం విశేషం. అదే విధంగా ఆంధ్రుల అభిమాన నటుడిగా ఖ్యాతి గాంచిన నందమూరి తారకరామారావు బయోపిక్ తెరకెక్కుతోంది. ఇందులో ఆయన వారసుడు బాలకృష్ణ నటించడం మరో విశేషం. అతిలోకసుందరిగా అలరించిన నటి శ్రీదేవి జీవిత చరిత్ర వెండితెరకెక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మరో పక్క తమిళ ప్రజల ఆరాధ్య నటుడు ఎంజీఆర్ బయోపిక్ నిర్మాణంలో ఉంది. ఆయనతో సినీ, రాజకీయ రంగంలో అనుబంధం ఉన్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ను చిత్రంగా మలచడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె పాత్రలో నటించడానికి తాను సిద్ధం అని నటి త్రిష పేర్కొంది. జయలలిత మరణించిన సందర్భంలో త్రిష ఆమె సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించింది. ఇటీవల ఒక భేటీలో ఆమె మాట్లాడుతూ జయలలిత చేతుల మీదగా అవార్డు తీసుకున్న ఫొటోను తన ట్విట్టర్ ముఖ చిత్రంగా పొందుపరచినట్లు తెలిపింది. తనకు చిన్నతనం నుంచే జయలలిత అం టే ఇష్టం అంది. ఆమె జీవిత చరిత్రను చిత్రంగా రూపొందిస్తే అందులో జయలలిత పాత్రను పోషించడానికి తాను రెడీ అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment