అంతకుమించి నటించలేనని వాళ్లకి అనిపించిందేమో - తాప్సీ
‘‘తెలుగు భాష మీద ఉన్నంత పట్టు నాకు తమిళం మీద లేదు. అయినా నా డైలాగ్స్ స్థానంలో ఏ.బీ,సీ,డీ, వన్ టూ త్రీలు చెప్పను. వాటి అర్థాలు తెలుసుకుని సంభాషణలు చెప్తాను.’’ అని కథానాయిక తాప్సీ చె ప్పారు.తను పనిచేసిన దర్శకుల గురించి తాప్సీ చెబుతూ-‘‘ ప్రతి దర్శకునికి ఓ స్టైల్ ఉంటుంది. అందుకే వాళ్లు చెప్పింది తు.చ తప్పకుండా పాటిస్తా. ఇంకా చెప్పాలంటే నా బ్రెయిన్‌ను స్విచ్చాఫ్ చేసేస్తాను. ఇప్పటికీ ఒక్కో సీన్ కోసం చాలా టేక్స్ తీసుకుంటాను. నటనలో నేను ప్రత్యేకంగా శిక్షణ ఏమి తీసుకోలేదు కాబట్టి, నా దర్శకుల నుంచి ఎంత నేర్చుకోవాలో అంత నేర్చేసుకుంటాను.
ప్రస్తుతం సుజిత్ సర్కార్ దర్శకత్వంలో ‘ఆగ్రా కీ దబ్రా’ చిత్రం కోసం ఉర్దూ భాష కూడా నేర్చుసుకుంటున్నాను. ఇలాంటి మంచి ప్రాజెక్ట్‌లు అంగీకరించేటప్పుడు ఇలాంటి కసరత్తులు తప్పనిసరిగా చేయాల్సిందే’’ అని అన్నారు. తెలుగు చిత్రాల్లో ఎందుకు నటించడంలేదన్న ప్రశ్నకు బదులిస్తూ ‘‘తెలుగులో ఇది వరకు నేను చేసిన పాత్రల తరహాలోనే అవకాశాలు వస్తున్నాయి. కొత్త పాత్రలు రావడం లేదు. అంతకుమించి నేను నటించలేనని వాళ్లకి అనిపించి ఉండచ్చు’’ అని చెప్పారు.