
క్వీన్ త్రిషేనా?
క్వీన్‌గా మారే అవకాశం సంచలన నటి త్రిషనే వరించనుందా? అన్న ప్రశ్నకు చిత్ర వర్గాల నుంచి సానుకూల సమాచారమే వస్తోంది. క్వీన్ చిత్రం 2014లో బాలీవుడ్‌లో ఒక సంచలనం. నటి కంగనా రనౌత్‌ను స్టార్‌ను చేసిన చిత్రం. ఆమె పాత్రలో నటించాలని చాలా మంది దక్షిణాది టాప్ హీరోయిన్లు ఆశించిన చిత్రం. అలాంటి చిత్ర దక్షిణాది భాషల రీమేక్ హక్కులను సీనియర్ నటుడు,దర్శక నిర్మాత త్యాగరాజన్ సొంతం చేసుకున్నారు.
విశేషం ఏమిటంటే ఈ సంచలన చిత్రానికి ఇద్దరు ప్రముఖ నటీమణులు తెరవెనుక పనిచేయనుండడం. అందులో ఒకరు సుహాసిని మణిరత్నం. తను ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు. ఇక మరో సీనియర్ నటీమణి రేవతి మెగాఫోన్ పట్టనున్నారు. వీరిద్దరు ఇంతకు ముందు దర్శకత్వం వహించిన ప్రతిభావంతులేనన్నది గమనార్హం.
ఈ చిత్రంలో క్వీన్ అయ్యేది ఎవరన్న విషయం చాలా కాలంగా జరుగుతున్న చర్చ. చాలా మంది అగ్రనాయికలతో చర్చలు జరిగినట్లు సమాచారం. తాజాగా నటి త్రిష పేరు తెరపైకి వచ్చింది. క్వీన్ చిత్ర రీమేక్‌లో నాయకిగా నటించే విషయమై అందాల భామ త్రిషలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. త్రిష ప్రస్తుతం చేస్తున్న చిత్రాలన్నీ కథానాయకి ప్రధాన చిత్రాలే. తాజాగా క్వీన్ చిత్రం కూడా ఈ బ్యూటీ ఖాతాలోకి చేరే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల బోగట్టా.