పెళ్లి కాని అమ్మలు
కథానాయికలు సాధారణంగా పిల్లలకు తల్లిగా నటించడానికి అంగీకరించరు. కారణం వారి గ్లామర్ ఇమేజ్‌కు భంగం కలుగుతుందేమోనన్న భయం కావచ్చు. అలాంటిది ఇప్పుటి హీరోయిన్లు ఇమేజ్ అనే చట్రంలో ఇరుక్కోవడానికి ఇష్టపడడం లేదు. ఇందుకు ఉదాహరణ నయనతార, త్రిషలే. దశాబ్దం దాటి అగ్ర కథానాయికలుగా రాణిస్తున్న ఈ బ్యూటీస్ ఇటీవల కమర్షియల్ హీరోయిన్ ఇమేజ్‌ను దాటి లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. వాటిలో నయనతార నటిస్తున్న ఒక చిత్రం ఇమైకా నోడిగళ్.
ఈ ఇందులో ఈ భామ సీబీఐ అధికారిణిగా నటిస్తున్నారు. అధర్వ, రాశీఖన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి అతిథిగా మెరవనున్నారు. ఇందులో నయనతార నాలుగేళ్ల పాపకు తల్లిగా నటిస్తున్నారని సమాచారం. ఈ పాప పాత్రను మానస్వి అనే చిన్నారి పోషిస్తోంది. ఇక నటి త్రిష విషయానికొస్తే, చతురంగవేట్టై–2 చిత్రంలో అరవిందస్వామికి జంటగా నటిస్తున్నారు.
దంపతులుగా నటిస్తున్న ఈ జంటకు నాలుగేళ్ల పాప ఉంటుందట. ఈ పాత్రను బేబీ మానస్వి నటించడం విశేషం. ఈ భామలిద్దరూ గతంలో ప్రేమలో విఫలం అయినవారే. పెళ్లి వరకూ వచ్చి ఆగిపోయిన అమ్మాయిలే. ఒక వేళ ఆ ప్రేమలు ఫలించి పెళ్లి చేసుకుంటే నయనతారకు, త్రిష నాలుగేళ్ల కూతుళ్లు ఉండే వారేమో. మూడు పదుల వయసు మీద పడినా పెళ్లి గడియలు ఇంకా దగ్గర పడని కథానాయికల్లో త్రిష ముందుంటారని చెప్పవచ్చు. ఆ తరువాత స్థానంలో నయనతారదే.