అమ్మ అయిన త్రిష అనగానే ఆశ్చర్యపోతున్నారా? త్రిష రియల్ లైఫ్‌లో అమ్మ అవ్వడానికి ఇంకా టైమ్ ఉంది గానీ, అంతకు ముందే రీల్ లైఫ్‌లో అమ్మతనాన్ని చవి చూసేస్తోంది. ఈ అమ్మడు కమర్శియల్ హీరోయిన్ల పాత్రలతో పాటు హీరోయిన్ సెంట్రిక్ పాత్రల్లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే రెండవ తరహా కథా పాత్రల్లో సరైన హిట్‌ను అందుకోలేదు. కాగా నటి నయనతార మాయ చిత్రంలో పిల్లకు తల్లిగా నటించి హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో తొలివిజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
తాజాగా ఆ తరహా కథా చిత్రం కాకపోయినా పరమపదం విళైయాట్టు చిత్రంలో త్రిష కూడా ఒక చిన్నారికి తల్లిగా నటిస్తోంది. అంతే కాదు అది వైద్యురాలి పాత్ర కావడం విశేషం. తిరుజ్ఞానం దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ పరమపదం విళైయాట్టు చిత్రంలో త్రిష ఇంతకు ముందెప్పుడూ చేయనటువంటి పాత్రలో నటిస్తున్నట్లు చెప్పారు. తాను చెప్పడం కాదు గానీ, ఇదే నిజం అన్నారు. త్రిష నటించిన చిత్రాలన్నింటికంటే ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందన్నారు.
అంతే కాదు ఆమె కెరీర్‌లో చాలా ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందన్నారు. 24 హవర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుందని చెప్పారు. చివరి షెడ్యూల్ షూటింగ్‌ను ఏర్కాడ్‌లోని 200 ఏళ్ల చరిత్ర కలిగిన రాబర్ట్ క్‌లైవ్ మేన్షన్ వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది వైకుంఠపాళి గేమ్‌లా చాలా ట్విస్ట్‌లతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో కూడిన చిత్రంగా ఉంటుందన్నారు. త్రిషకు కథ నచ్చడంతో చాలా ఇష్టపడి నటిస్తున్నారని చెప్పారు. చాలా రిస్కీ షాట్స్‌ను సింగిల్ టేక్‌లో చేసేస్తున్నారని అన్నారు.
ఆమెతోపాటు, నందా, రిచర్డ్, వేల్‌రామమూర్తి నటిస్తున్నారని తెలిపారు. దీనికి ఆర్‌డీ.రాజశేఖర్ ఛాయాగ్రహణం, అమ్రేశ్ సంగీతాన్ని అందిస్తున్నారని తలిపారు. చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు దర్శకుడు తిరుజ్ఞానం చెప్పారు. చూద్దాం ఈ చిత్రం అయినా త్రిషకు విజయాన్ని అందిస్తుందేమో.
Comments
Please login to add a commentAdd a comment