తమిళసినిమా: నలుపే నాకిష్టం అంటోంది నటి త్రిష. నటిగా రెండు దశాబ్దాలను టచ్ చేసిన చెన్నై సుందరి.. మోడలింగ్ రంగం నుంచి వెండితెరకు పరిచయమై పలు భాషల్లో అనేక రకాల పాత్రల్లో నటించింది. అయితే తమిళ ప్రేక్షకులకు మాత్రం ఒక జెస్సీ గానూ ఒక జానూ గానూ చిరకాలం నిలిచిపోతుంది. విన్నైతాండివరువాయా చిత్రంలో జెస్సీగా జీవించిన ఈ బ్యూటీ ఇటీవల 96 చిత్రంలో జానూ పాత్రకు ప్రాణం పోసింది. ఇక కమర్షియల్ చిత్రాల్లో అందాలనూ బాగానే ఆరబోసింది. ఈ సందర్భంగా త్రిషతో చిన్న ఇంటర్వ్యూ.
ప్రేమ కథా పాత్రల్లో మిమ్మల్ని ప్రేక్షకులు చాలా చిత్రాల్లో చూశారు. మాస్ కథా పాత్రల్లో వారిని అలరించే అవకాశం ఉందా?
మాస్ కథానాయకులకు జంటగా నటిస్తేనే మాస్ కథానాయికలుగా పేరు తెచ్చుకుంటారు. అలా నేను చాలా చిత్రాల్లో నటించాను. ఇక హీరోయిన్‌కు ప్రాధాన్యత ఉన్న కథా పాత్రలు ఇప్పుడే రావడం ప్రారంభించాయి. అవి విజయం సాధించిన తరువాత మీరు అంటున్న పాత్రల గురించి ఆలోచిద్దాం. 96 చిత్రం సక్సెస్ తరువాత ప్రేమ కథా చిత్రాల అవకాశాలు చాలా వస్తున్నాయి. చిత్రం చూసి ఇంటికి వెళ్లిన తరువాత ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తిరగాలి. అలాంటి కథా చిత్రాల కోసం ఎదురుచూస్తున్నాను.
కోలీవుడ్‌లో ప్రముఖ హీరోలందరితోనూ నటించారు. ఇంకా ఎవరితోనైనా నటించాలన్న కోరిక ఉందా?
కోలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్ లాంటి ఇతర భాషల్లోనూ ప్రముఖ హీరోలందరితోనూ నటించాను. రజనీకాంత్‌తో నటించాలన్న కోరిక మేరకే పేట చిత్రంలో నటించాను. అందులో పాత్ర చిన్నదే అయినా చాలా సంతృప్తి కలిగించింది.
నటుడు విజయ్‌తో గిల్లీ, తిరుపాచ్చి, ఆది, కురువి చిత్రాల్లో నటించారు. మరోసారి ఆయనతో జత కట్టే అవకాశం ఉందా? విజయ్‌తో నటించిన చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రం?
విజయ్‌తో నటించడానికి నేనెప్పుడూ రెడీనే. నాకు నప్పే పాత్ర అయితే రెట్టింపు సంతోషం. విజయ్‌తో నటించిన చిత్రాల్లో గిల్లీ చాలా ఇష్టం. అందులో కథా పాత్ర అలాంటిది.
ఇప్పటికీ చాలా స్లిమ్‌గా ఉన్నారు. మీ సౌందర్య రహస్యం?
నేను స్లిమ్‌గా ఉండడానికంటూ ప్రత్యేకంగా ఎలాంటి కసరత్తులూ చేయను. పుష్టిగా లాగిస్తాను.
పేట చిత్రంలో రజనీకాంత్‌తో నటించిన అనుభవం గురించి? ఆయనతో పూర్తి స్థాయి హీరోయిన్ పాత్రలో నటించాలని కోరుకుంటున్నారా?
96 చిత్రంలో చాలా బాగా నటించావని రజనీకాంత్ ఫోన్ చేసి అభినందించారు. ఇక పేట చిత్రంలో నేను చిన్న పాత్రనే చేశాను. ఆయనతో మరోసారి నటించే అవకాశం వస్తే కథానాయకిగా చిత్రం అంతా ఉండే పాత్రలో నటించాలని కోరుకుంటున్నాను. పేట చిత్ర షూటింగ్‌లో రజనీకాంత్ పక్కన కూర్చుని మాట్లాతుంటే అప్పుడే ఆయన ఎంత అద్భుతమైన వ్యక్తో అర్థమైంది.
చిత్ర జయాపజయాలను ఎలా స్వీకరిస్తారు?
విజయం వస్తే సంతోషిస్తాను. అపజయం అయితే అదీ గడిచి పోతుందని భావిస్తాను.
తరచూ విదేశాలకు వెళ్తుంటారు. ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?
నాకు ప్రయాణమంటే చాలా ఇష్టం. ఇప్పుటికే ప్రపంచం అంతా చుట్టేశాను.
సహ నటీమణులు చాలా మంది పెళ్లి చేసుకుంటున్నారు.మీకు పెళ్లి కాలేదన్న చింత లేదా?
నేనెప్పటికైనా ప్రేమ వివాహమే చేసుకుంటాను. అయితే నాకిప్పటి వరకూ ప్రేమ పుట్టలేదు. నా మనసుకు నచ్చిన వాడిని కలిస్తే, ఆయనపై నాకు, నాపై తనకూ ప్రేమ పుడితే అది ఈ రోజైనా, రేపైనా పెళ్లి చేసుకుంటాను.
మీకు కాబోయే భర్త ఎలా ఉండాలనుకుంటున్నారు?
నాకు కాబోయే భర్త ఎర్రగానో, తెల్లగానో ఉండాలన్న కోరికలేమీ లేవు. ఇంకా చెప్పాలంటే నాకు నలుపంటేనే చాలా ఇష్టం. తెల్లగా ఉంటేనే అందం అని అనుకోను. నలుపురంగూ అందమే.
Comments
Please login to add a commentAdd a comment