
కోర్టు తీర్పు కోసం వెయిటింగ్: త్రిష
ఇటీవల సినిమావాళ్లు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంటోంది. అలాంటి పరిస్థితి నటి త్రిషకు తప్పలేదు. ఆదాయం తప్పుడు లెక్కల వ్యవహారంలో నటి త్రిష మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. వివరాల్లోకెళితే నటి త్రిష 2010–11 సంవత్సరానికి గానూ తన ఆదాయం రూ.89 లక్షలుగా అంటూ ఆదాయపన్ను శాఖ అధికారులకు చెప్పారు. ఇది నమ్మశక్యంగా లేకపోవడంతో ఆదాయ శాఖ అధికారులు త్రిష ఆదాయం లెక్కలను నిగ్గదీశారు. త్రిష తదుపరి ఏడాదిలో నటించనున్న చిత్రాలకు అందుకున్న అడ్వాన్స్‌లను లెక్కల్లో చూపకపోవడాన్ని కనుగొన్న అధికారులు ఆమె ఆదాయం రూ.3.5కోట్లుగా తేల్చి అందుకు పన్ను వసూలు చేశారు.
అంతటితో వదలకుండా త్రిష తప్పుడు లెక్కలు చూపినందుకుగానూ ఆమెపై రూ.1.15 కోట్ల జరిమానా చెల్లించాలంటూ కేసు నమోదు చేశారు. దీంతో త్రిష తనపై జరిమానా కేసు కొట్టివేయాల్సిదిగా ఆదాయపు శాఖ ట్రిబ్యునల్‌కు విజ్ఞప్తి చేశారు. దీ పరిశీలించిన ట్రిబ్యునల్ త్రిష మొత్తం ఆదాయానికి పన్ను చెల్లించారు కాబట్టి ఆమెపై కేసును కొట్టేసింది. దీంతో ఆదాయ శాఖ అధికారులు త్రిషపై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు గురువారం విచారణకు వచ్చింది. న్యాయమూర్తులు ఇందిరాబెనర్జీ, సుందర్‌లు త్రిష కేసును విచారణకు స్వీకరించారు. అయితే ఈ కేసు వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తులు ప్రకటించారు. దీంతో హైకోర్టు తీర్పు కోసం త్రిష వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.