
‘గొంతులో ఉన్న మాట అయితే నోటి చెప్పగలం.. కానీ మనసులో ఉన్న మాట..కేవలం కళ్లతోనే చెప్పగలం’.. అంటూ నువ్వేకావాలిలో తరుణ్, రీచాతో చెప్పినా.. ‘నీ జీవితంలో వంద మార్కులు ఉంటే 20నాకు, 80వాడికా.. ఇంకో పదిహేను వేసి ఈ నాన్నను పాస్ చేయలేవా అమ్మా’.. అంటూ ప్రకాష్ రాజు కంటతడితో చెప్పినా.. ‘బాగుండటం అంటే బాగా ఉండటం కాదు అంటూ నలుగురితో ఉండటం, నవ్వుతూ ఉండటం’..అంటూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్‌గా చెప్పినా.. వీటిలో సగటు ప్రేక్షకుడు చూసేదీ, ఆస్వాదించేదీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేసిన మాయాజాలం.
ఒక డైలాగ్ వింటే అది ఎవరి కలంలోంచి జారిపడిందో చెప్పడం కష్టమే.. కానీ ఆ పదాలు త్రివిక్రమ్ కలంలోంచి వస్తే మాత్రం ప్రేక్షకులు ఇట్టే గుర్తుపట్టేస్తారు. అంతలా ఆ మాటలు మదిలో నాటుకుపోతాయి. త్రివిక్రమ్ తన ప్రాసలతో సినిమాలను ఓ స్థాయిలోకి తీసుకెళ్తారు. వెండితెరపై ఒక్కోసారి ఆయన వేసే మంత్రం పనిచేయకపోయినా.. బుల్లితెరపై మాత్రం టీఆర్పీ రేటింగ్స్‌లో రికార్డులు క్రియేట్‌చేస్తాయి. అతడు, ఖలేజా ఇప్పటికీ బుల్లితెరపై సెన్సేషనే. మాటల తూటాలను తన మెదడులో దాచిపెట్టుకున్న త్రివిక్రముడి పుట్టినరోజు నేడు (నవంబర్ 7). ఈ సందర్భంగా త్రివిక్రమ్ ఫేమస్ డైలాగ్స్‌ల్లోంచి కొన్నింటిని ఓ సారి చూద్దాం.
‘వంట రుచి తినే దాకా తెలియదు.. బుక్ గొప్పదనం చదివేదాకా తెలియదు.. ప్రేమంటే ఏంటో మనల్ని ప్రేమించేవాళ్లను కోల్పేయేదాకా తెలియదు’.. ‘నిజం చెప్పకపోవడం అబద్దం.. అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం’ .. ‘దేవుడు చాలా దుర్మార్గుడు..కళ్లున్నాయని సంతోషించేలోపే కన్నీళ్లున్నాయని గుర్తుచేస్తాడు’ .. ‘లవ్ చేసే అంతా లక్జరీ లేదు.. వదిలేసే అంతా లేవలూ లేదు’.. ‘మనం బాగున్నప్పుడు లెక్కల గురించి మాట్లాడి.. కష్టాల్లోన్నప్పుడు విలువల గురించి మాట్లాడుకూడదు’.. ‘పాలిచ్చి పెంచిన వాళ్లకి.. పాలించడం ఒక లెక్కా’.... ఇలా ఏ డైలాగ్‌ను తీసుకున్న త్రివిక్రమ్ గుర్తుకురావాల్సిందే. త్రివిక్రమ్ సినిమాల్లోని ప్రతీ మాట ఒక ఆణిముత్యమే.
త్రివిక్రమ్ వేదికలపై మాట్లాడటం చాలా అరుదు. అయితే తివిక్రమ్ వేదిక ఎక్కితే.. ఏం మాట్లాడుతారని అభిమానులు ఎదురుచూస్తు ఉంటారు. ఆయన ప్రసంగం ఎంతో మందిని ప్రభావితం చేస్తుంది. ఒక హీరోకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక డైరెక్టర్‌కు ఉండటమనే విషయం కొందరికే సాధ్యం. అందులోనూ త్రివిక్రమ్ శైలిని ఇష్టపడే అభిమానులెందరో ఉన్నారు. త్రివిక్రమ్ ఇంకెన్నో ఆణిముత్యాల్లాంటి మాటలను ప్రేక్షకులకు అందించాలి.. అందిస్తూనే ఉండాలని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment